Elon Musk Twitter Deal : వెయిటింగ్ పిరియడ్ ఓవర్ - ట్విట్టర్‌ను కొనకపోతే మస్క్‌కు భారీ జరిమానా ఖాయమా ?
ట్విట్టర్‌ను కొనేస్తానని హడావుడి చేసిన టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ ఇప్పుడు సైలెంటయిపోయారు. ఫేక్ అకౌంట్ల పేరుతో ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వదిలి పెట్టేది లేదని ట్విట్టర్ అంటోంది.
Elon Musk Twitter Deal : టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్‌కు మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ షాకిచ్చింది. ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించి ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన గడువు ముగిసిందని తెలిపింది. షరతులకు లోబడి మస్క్ కొనుగోలును పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ కొనుగోలు జరగాలంటే ట్విట్టర్ స్టాక్ హోల్డర్ల ఆమోదం మళ్లీ తీసుకోవాలి. హెచ్ఎస్ చట్టం నిబంధనల మేరకు భారీ ట్రాన్సాక్షన్స్ పైన ఫెడరల్ ట్రేడ్ కమిషన్, యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ యాంట్రీట్రస్ట్ డివిజన్లు రివ్యూ చేయాలి. రివ్యూ అనంతరం ట్విట్టర్ కొనుగోలు ఉంటుంది.
ఎలన్ మస్క్ దాదాపుగా 44 బిలియన్ డాలర్లతో అంటే మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు ట్విట్టర్‌ను కొనేయాలని డిసైడ్ అయ్యారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని మస్క్ భావించారు. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. ఆరు నెలల్లో ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతికి వెళ్లాలి. కానీ ఫేక్ అకౌంట్స్ అంశంపై సమాచారం ఇవ్వాలని మస్క్ డిమాండ్ చేస్తున్నారు. ఈ అభ్యర్థనను ట్విట్టర్ తిరస్కరించింది. దీంతో ఈ డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచారు.
ఆయన ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. అన్నీ చూసుకునే ఆయన కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని ట్విట్టర్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పుడు లేని పోని పరిశీలనల పేరుతో కొనుగోలు నుంచి వెనక్కి తగ్గితే ఊరుకునేది లేదంటున్నారు. నిజానికి ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేయడంపై మొదట్లో వ్యతిరేక వ్యక్తమయింది. ఆయన చేతికి ట్విట్టర్ వెళ్లకూడదని బోర్డు ప్రయత్నించింది. కానీ మస్క్ తిరుగులేని ఆఫర్ ఇవ్వడంతో వాటాదారులు అంగీకరించారు. కానీ ఇప్పుడు మొత్తానికే తేడా కొట్టింది. ముందూ వెనుకా చూసుకోకుండా తాను ఆఫర్ ఇచ్చేశానేమో అని మస్క్ అనుకుంటున్నారేమో కానీ… వెనక్కి తగ్గుతున్నారు.
ఇప్పుడు చెప్పినట్లుగా 44 బిలియన్ డాలర్లు కట్టి కొనకపోతే కోర్టుకెళ్లి మరీ కొనిపిస్తామని ట్విట్టర్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒప్పందంలో ఎవరు వెనక్కి తగ్గినా బిలియన్ డాలర్లు పరిహారం ఇవ్వాలన్న నిబంధన ఉంది. అంటే మన రూపాయిల్లో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు. మూడున్నర లక్షల కోట్లు పెట్టి కొని ట్విట్టర్‌ను నెత్తి మీద పెట్టుకోవడం కన్నా ఏడున్నర వేల కోట్లతో ఈ గండం నుంచి బయటపడితే బెటర్ అని మస్క్ అనుకుంటే ఆ మొత్తం కట్టేసి బయటపడే అవకాశం ఉంది. లేకపోతే మొత్తం కొనుగోలుకు సిద్ధపడాలి. మరి మస్క్ ఏం చేస్తారో !