Venezuela: అమెరికా చెరలో వెనిజులా అధ్యక్షుడు మదురో - భీకరంగా దాడులు చేసి బంధించామని ట్రంప్ ప్రకటన
Trump: మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించిన వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు.

Trump says Venezuela Maduro and his wife have been captured : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా దళాలు బందీలుగా పట్టుకున్నాయని వెల్లడించారు. శనివారం జనవరి 3, 2026 తెల్లవారుజామున వెనెజులాపై అమెరికా నిర్వహించిన భారీ సైనిక దాడిలో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
శనివారం తెల్లవారుజామున వెనెజులా రాజధాని కరాకస్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా దళాలు ఆ దేశంలోని కీలక సైనిక కేంద్రాలు, ప్రభుత్వ భవనాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో మదురో దంపతులను పట్టుకుని, వారిని విమానంలో వెనెజులా నుంచి తరలించినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ధృవీకరించారు. 1989లో పనామా పాలకుడు మాన్యుయెల్ నోరియెగాను అమెరికా బంధించిన తర్వాత, ఒక దేశాధినేతను అమెరికా దళాలు వారి సొంత భూమిపై అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి.
U.S. President Donald J. Trump announces the successful capture of Venezuelan President Nicolás Maduro and his wife in an operation tonight in Venezuela’s capital of Caracas. pic.twitter.com/94whTZuaHI
— OSINTdefender (@sentdefender) January 3, 2026
చాలా కాలంగా మదురో ప్రభుత్వంపై అమెరికా తీవ్ర అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా మదురో డ్రగ్స్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని, తన అధికారాన్ని నిలుపుకోవడానికి అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారని అమెరికా గతంలోనే అభియోగాలు మోపింది. మదురో పట్టిచ్చిన వారికి ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది 50 మిలియన్ డాలర్ల భారీ రివార్డును కూడా ప్రకటించింది.
అమెరికా దాడుల నేపథ్యంలో వెనెజులా ప్రభుత్వం దేశంలో జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించింది. తమ దేశంపై అమెరికా దురాక్రమణకు పాల్పడుతోందని, సహజ వనరుల కోసమే ఈ దాడులు చేస్తోందని మదురో మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. దాడుల కారణంగా కరాకస్ నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
🚨HAPPENING NOW: New video of Caracas Venezuela as the US hits multiple locations. The US has not commented but we all know what’s happening. Maduro is finding out the hard way. Prayers up for our troops. pic.twitter.com/RbMnKI0SRb
— Andrew (@AllegedlyDrew) January 3, 2026
మదురో దంపతులను ఎక్కడికి తరలించారు? వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నారు? అనే విషయాలను ట్రంప్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా పట్టును పెంచుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక విజయమని కొందరు విశ్లేషిస్తుండగా, ఇతర దేశాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి.





















