Srilanka Crisis: శ్రీలంకలో కొనసాగుతున్న హింసాకాండ! ప్రధాన మంత్రి ఇంటికి నిప్పు, అధ్యక్షుడి ఇంటి ముందూ నిరసనలు
Sri Lanka News: దేశవ్యాప్తంగా ఆందోళన కారులు చేస్తున్న ఈ హింసాకాండలో జరిగిన కాల్పుల్లో ప్రస్తుత ఎంపీ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హింస ఘటనల్లో కనీసం 173 మంది గాయపడ్డారు.
Srilanka PM House Set on Fire: శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఆ దేశ ప్రధాన మంత్రి మహింద రాజపక్స సోమవారం (మే 9) తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాన మంత్రి మహీంద ఇంటితో పాటు పార్టీలోని ఆయన బంధువులు, 15 మందికి పైగా అధికార పార్టీకి చెందిన వారి ఇళ్లు, కార్యాలయాలను నిరసనకారులు తగలబెట్టారు. గత రాత్రి (మే 9) ప్రధాని ఇల్లు కాలి బూడిద అయింది. ఇప్పటివరకు నిరసనకారులు గాలే ఫేస్ గ్రీన్‌లోని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కార్యాలయం వెలుపల శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ హింసాకాండ దృష్ట్యా గత రాత్రి నుంచి రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆందోళన కారులు చేస్తున్న ఈ హింసాకాండలో జరిగిన కాల్పుల్లో ప్రస్తుత ఎంపీ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దారుణ స్థాయిలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, విద్యుత్ కోతల కారణంగా శ్రీలంకలో గత నెల నుంచి ప్రదర్శనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అవి తీవ్ర రూపం దాల్చాయి. ఈ హింస ఘటనల్లో కనీసం 173 మంది గాయపడ్డారు.
Sri Lanka | PM Mahinda Rajapaksa’s residence in Kurunagala set on fire. The houses of several other MPs were also set on fire last night pic.twitter.com/u1WqNUQ0tz
— Samvada World (@SamvadaWorld) May 10, 2022
ఎంపీ, భద్రతా సిబ్బంది హత్య
రాజధాని నుంచి తిరిగి వస్తున్న రాజపక్సే మద్దతుదారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలోన్నరువా అనే జిల్లాకు చెందిన శ్రీలంక పొదుజన పెరమున (SLPP) ఎంపీ అమరకీర్తి ఆటుకోరాలను ప్రభుత్వ వ్యతిరేక బృందం చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఎంపీని తన కారులోనే కాల్చి చంపారని చెప్పారు. మాజీ మంత్రి జాన్సన్ ఫెర్నాండో కురునెగల, కొలంబో కార్యాలయాలపై ఆగ్రహంతో మూకలు దాడి చేశాయి. మాజీ మంత్రి నిమల్ లంజా నివాసంపై కూడా దాడి జరగగా, మేయర్ సమన్ లాల్ ఫెర్నాండో నివాసానికి నిప్పు పెట్టారు.
మహింద రాజపక్సే తన రాజీనామా లేఖను అధ్యక్షుడు గోటబయ రాజపక్సేకు సోమవారం పంపారు. తక్షణం అమల్లోకి వచ్చేలా నా రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు మహింద ట్వీట్ చేశారు.
అందుకే తప్పుకుంటున్నా: మహీంద
మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు తాను వైదొలగుతున్నట్లు ప్రధాని మహింద తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మే 6న జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో అఖిలపక్ష తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నామని అన్నారు. ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని మహింద తెలిపారు. ప్రధాని రాజీనామాతో మంత్రివర్గం కూడా రద్దయింది. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మధ్యంతర పరిపాలనను ఏర్పాటు చేయాలని మహింద రాజపక్సే తమ్ముడు, అధ్యక్షుడు గోటబయ రాజపక్సే నేతృత్వంలోని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ ప్రదర్శనలు జరిగాయి.
పోలీసుల సెలవులు రద్దు
మరోవైపు సోమవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు విధించిన కర్ఫ్యూను అధికారులు పొడిగించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఆర్మీ బృందాలు నిరసన ప్రదేశంలో మోహరించారు. రక్షణ కార్యదర్శి దేశంలో శాంతిని కాపాడేందుకు ప్రజల మద్దతును కోరారు. అయితే ప్రజల భద్రత కోసం పోలీసులకు సహాయం చేయడానికి మూడు సాయుధ బలగాలను పిలిచారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పోలీసులందరికీ సెలవులు రద్దు చేశారు.