South Korea's New President: దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్- కిమ్‌తో చర్చకు రెడీ
South Korea's New President: దక్షిణా కొరియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన యూన్ సుక్ యోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాతో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
South Korea's New President:
దక్షిణ కొరియా నూతన దేశాధ్యక్షుడిగా కన్జర్వేటివ్ నేత యూన్ సుక్ యోల్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం అర్ధరాత్రి ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ న్యాయవాది అయిన యూన్ మార్చిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.
చర్చకు రెడీ
అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలక వ్యాఖ్యలు చేశారు యూన్. దక్షిణ కొరియాకు ప్రమాదకరంగా మారిన ఉత్తర కొరియాతో చర్చలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఉత్తర కొరియాతో సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే 15 సార్లు ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించింది. దీనిపై దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది.
26 లక్షల డాలర్ల ఖర్చుతో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. సుమారు 40 వేల మంది గెస్ట్‌లను ఆహ్వానించారు. చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషాన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాష హయషీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్ ఎమాఫ్‌లు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్ యోల్ విజయం సాధించారు. హోరాహోరీ పోరులో అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యూంగ్ ఓటమిని అంగీకరించారు. మాజీ ప్రాసిక్యూటర్ సుక్ యోల్ విజయం సాధించినట్లు మార్చిలో అధికారులు ప్రకటించారు.
అమెరికాతో
అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకుని, శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మించి, ఉత్తర కొరియా కవ్వింపులను సమర్థంగా ఎదుర్కొంటామని యూన్ ఇటీవల అన్నారు. ఉత్తర కొరియాతో కఠినంగానే వ్యవహరిస్తామన్నారు. అమెరికాతో సంబంధాలు పటిష్ఠం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడిపై ఆయన విమర్శలు చేశారు. ఉత్తర కొరియాకు లాభపడేలా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు.
Also Read: Punjab News: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ ఆఫీసుపై గ్రనేడ్ దాడి!
Also Read: Army Chief: చైనా ఉద్దేశం అదే అయితే భారత్ టార్గెట్ ఇదే: ఆర్మీ చీఫ్