Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా మధ్య మూడో రౌండ్ చర్చలు- ఈసారైనా ఫలిస్తాయా?
రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం మూడో రౌండ్ చర్చలు జరగనున్నాయి. అయితే వేదిక ఇంకా తెలియలేదు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడో దఫా శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. సోమవారం ఈ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు సలహాదారు తెలిపారు. అయితే ఈసారి చర్చలు ఎక్కడ జరుగుతాయి అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
బెలారస్‌లోనా?
ఇరు దేశాల మధ్య చర్చలు బెలారస్‌లోనే జరిగే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందే బెలారస్‌లో చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒప్పుకోకపోయినప్పటికీ.. తర్వాత అంగీకరించారు. కానీ ఆశించనంత స్థాయిలో చర్చలు సఫలం కాలేదు.
అలాగే బెలారస్ అధ్యక్షుడు ఉక్రెయిన్‌కు, రష్యాకు కూడా సహకరించనని ప్రకటించారు. ఈ క్రమంలో మూడో దశ చర్చలు బెలారస్ వేదికగా జరుగుతాయా? అనేదానిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈసారి వేదిక మారే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య జరిగిన రెండు రౌండ్ల చర్చల్లో పౌరుల కోసం సురక్షిత కారిడార్ల నిర్మాణానికి ఏకాభిప్రాయం కుదిరింది.
దాడులు ఉద్ధృతం
ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమైన తర్వాత రష్యా తన దాడులను ఉద్ధృతం చేసింది. మరోవైపు రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మూడో రౌండ్ చర్చలు ఎంత వరకు ఫలిస్తాయి అనే దానిపై అనుమానాలు వ్యక్తవమవుతున్నాయి. గత రెండు రౌండ్ల చర్చలు ఫిబ్రవరి 28, మార్చి 3న జరిగాయి.
జెలెన్‌స్కీ ఫోన్
రష్యా దాడులకు పాల్పడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌కు రక్షణ, ఆర్థిక మద్దతు వంటి అంశాలపై చర్చించారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత బైడెన్‌తో జెలెన్‌స్కీ ఫోన్లో మాట్లాడటం ఇది రెండోసారి.
Also Read: Wedding: యాభైమూడేళ్ల వయసు తేడాతో పెళ్లి చేసుకున్న ఆ జంట ఇప్పుడెలా ఉందో తెలుసా?
Also Read: Delhi High Court: ఆ కోడలికి అత్తవారింట్లో నివసించే హక్కు లేదు: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు