Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై పుతిన్ తగ్గేదేలే! ఐసీజే ఆదేశాలను కూడా లెక్కచేయని రష్యా
ఉక్రెయిన్‌పై చేస్తోన్న దాడులను రష్యా వెంటనే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం చేసిన ఆదేశాలను పుతిన్ తిరస్కరించారు.
ఉక్రెయిన్‌పై ఎవరు చెప్పినా రష్యా వెనక్కి తగ్గేలే కనిపించడం లేదు. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను కూడా తాము పరిగణనలోకి తీసుకోబోమని రష్యా ప్రకటన చేసింది. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై దాడుల్ని మరింత తీవ్రం చేస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐసీజే ఆదేశాలను రష్యా తప్పక పాటించాల్సి ఉన్నా పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
#BREAKING Kremlin rejects top UN court order for Russia to suspend Ukraine offensive pic.twitter.com/zQ639luNqy
— AFP News Agency (@AFP) March 17, 2022
ఉక్రెయిన్ దాడిని సస్పెండ్ చేయాలని రష్యాకు ఐరాస ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను క్రెమ్లిన్ తిరస్కరించింది. అంతేకాకుండా ఐసీజే ఆదేశాల పట్టింపు లేకుండా 22వ రోజూ ఉక్రెయిన్‌పై ఆక్రమణ కొనసాగిస్తోంది రష్యా.
కోర్టు ఆదేశాలు
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న సైనిక ఆపరేషన్‌పై అంతర్జాతీయ కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి, భద్రతా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఐసీజే ఆదేశించింది.
రష్యాకు వ్యతిరేకంగా భారత్
ఐసీజేలో భారత జడ్జీ జస్టిస్ దల్వీర్ భండారీ ఈ కేసులో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. జస్టిస్ దల్వీర్ భండారీ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో 2012 నుంచి సభ్యుడిగా ఉన్నారు. ఆయన 2017 నవంబర్‌లో మరోసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 9 ఏళ్ల పాటు ఆ స్థానంలో ఉండేందుకు 2018 ఫిబ్రవరిలో నియమితులయ్యారు.
ఐరాస టాప్ కోర్టుకు ప్రభుత్వ మద్దతు సహా వివిధ మిషన్ల సాయంతో జస్టిస్ భండారీ నామినేట్ అయ్యారు. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఆయన వేసిన ఓటు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని తెలుస్తోంది. రష్యా- ఉక్రెయిన్ వివాదంపై ఆయన అభిప్రాయానికి ఆధారంగానే ఆయన ఓటు వేశారు. ఎందుకంటే ఈ అంశంపై భారత అధికారిక స్టాండ్ వేరుగా ఉంది.
ఉక్రెయిన్- రష్యా వివాదంపై ఐరాసంలో జరిగిన ఓటింగ్‌కు భారత్ రెండు సార్లు దూరంగా ఉంది. చర్చల ద్వారానే ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ చెప్పింది.
Also Read: Snake Stunt Goes Wrong : కోబ్రాలతో గేమ్సా ? ఏం జరుగుతుందో సయ్యద్‌కు బాగా తెలుసు