Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా యుద్ధం టాప్-10 అప్‌డేట్స్- రష్యా వదిలేదేలే, ఉక్రెయిన్ తగ్గేదేలే!
Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై నేటికి 9 రోజులు అయింది. అయితే ఇన్ని రోజుల్లో యుద్ధంలో టాప్- 10 అప్‌డేట్స్ ఇవే.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై 9వ రోజు రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై దాడిని రష్యా మరింత ఉద్ధృతం చేసింది. అక్కడి అణు విద్యుత్తు కేంద్రమే లక్ష్యంగా రష్యా దాడులు చేపడుతోంది.
ఐరోపాలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌గా పేర్కొనే ఎనర్హోదర్ నగరంలోని జపోరిజ్జియా కేంద్రంపై రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో మంటలు చెలరేగి పరిస్థితి ఆందోళకరంగా మారింది. రష్యన్ సేనలు దాడులు ఆపకపోతే పెను విధ్వంసం తప్పదని ఉక్రెయిన్ పేర్కొంది. మరి ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో టాప్- 10 అప్‌డేట్స్ ఓసారి చూద్దాం.
టాప్- 10 అప్‌డేట్స్
1. యుద్ధాన్ని ఆపాలంటే తనతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ గురువారం అన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన రెండో దఫా చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి లేకపోవడంతో జెలెన్‌స్కీ ఇలా ఉన్నారు. అలానే ఐరోపా దేశాలను మరిన్ని ఆయుధాలు, యుద్ధ విమానాలను పంపాలని జెలెన్‌స్కీ కోరారు.
2. 9 రోజులుగా చేస్తోన్న యుద్ధంలో.. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ఖేర్సన్‌ను రష్యా గురువారం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడి పెంచింది. దాదాపు 15 కేంద్రాలపై రష్యా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని పావు వంతు విద్యుత్ ఉత్పత్తి వీటి నుంచే జనరేట్ అవుతోంది.
3. బ్లాక్ సీ పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు ఆ తీరంతో ఉక్రెయిన్‌కు ఉన్న సంబంధాలను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అలానే అజోల్ సముద్రం వద్ద ఉన్నమరో వ్యూహాత్మక పోర్ట్ సిటీ మరియూపోల్ వద్ద ఇరు సైన్యాల మధ్య భీకర పోరు జరుగుతోంది. మరో పోర్ట్ సిటీని కోల్పోతే కీవ్‌కు భారీ నష్టం కలిగే అవకాశం ఉంది.
4. ఇరు దేశాల మధ్య గురువారం కాల్పుల విరమణ కోసం రెండో దఫా చర్చలు జరిగాయి. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి సాధారణ పౌరుల తరలింపునకు ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేసేందుకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు అంగీకరించాయి. 9 రోజుల యుద్ధంలో శాంతిస్థాపనకు ఇదే తొలి పురోగతి
5. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం ఫోన్‌లో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సైనిక ఆపరేషన్‌ను ఆపేది లేదని, తమ లక్ష్యాన్ని చేరుకునేవరకు దాడి చేస్తామని పుతిన్ వివరించారు.
6. యుద్ధం మొదలైన 7 రోజుల్లో ఉక్రెయిన్ నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలు వలసవెళ్లిపోయారు. లక్షలమంది ప్రాణాలకు ఈ యుద్ధంతో ముప్పు పొంచి ఉందని ఐరాస వెల్లడించింది.
7. ఉక్రెయిన్ పౌరులకు సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. తక్షణ భద్రత సహకారం కింద ఉక్రెయిన్ నుంచి వచ్చే పౌరులకు పునరావాసం కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం దేశబహిష్కరణ నిబంధనలను 18 నెలల పాటు నిలిపివేసింది.
8. ఉక్రెయిన్‌పై యుద్ధం చేపట్టిన తర్వాత రష్యా ఏకాకిగా మారింది. చాలా దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ రష్యా మాత్రం.. ఉక్రెయిన్‌పై తాము సైనిక ఆపరేషన్ మాత్రమే చేపట్టామని పునరుద్ఘాటిస్తోంది.
9. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్.. పుతిన్‌ను హెచ్చరించారు. పుతిన్ చెప్పే అసత్యాల వల్ల రష్యా భవిష్యత్తులో కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని, దారుణమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేక్రాన్ అన్నారు.
10. ఇప్పటికే రష్యా సైనికులు వేలమంది మరణించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. కానీ రష్యా మాత్రం తమ సైనికుల మరణాలు వందల్లోనే ఉన్నట్లు వాదిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు చెందిన 350 మంది పౌరులు మృతి చెందినట్లు ఆ దేశం తెలిపింది. అయితే పశ్చిమ దేశాలు మాత్రం దశాబ్దాల్లో రష్యా చూడని ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నాయి. ఐరాస కూడా రష్యా వెంటనే తన బలగాలను వెనక్కి పిలవాలని తీర్మానం చేసింది.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయం- కీవ్ నుంచి తప్పించుకునే సమయంలో
Also Read: Ukraine Russia War: అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా బాంబు దాడులు - వీడియో వైరల్