Ukraine Russia War: అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా బాంబు దాడులు - వీడియో వైరల్
Zaporizhzhia Nuclear Power Plant: ఉక్రెయిన్‌లో ఉన్న యూరప్ లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా దాడులతో న్యూక్లియర్ పవర్ ప్లాంటులో మంటలు చెలరేగాయి.
Ukraine Russia War: ఉక్రెయిన్‌తో చర్చలు మొదలుపెట్టినా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్‌లో ఉన్న యూరప్ లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా దాడులతో జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంటులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని స్థానిక అధికారులు మీడియాకు తెలిపుతూ ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
యూరప్‌లో అతిపెద్ద పవర్ ప్లాంట్‌పై రష్యా దాడులు
గత వారం రోజులనుంచి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడేతోంది. అంతర్జాతీయంగా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నప్పటికీ పుతిన్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది రష్యా. ఉక్రెయిన్‌లోని జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (Zaporizhzhia Nuclear Power Plant)పై రష్యా బాంబు దాడులు చేయడంతో మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ వెల్లడించింది. యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పేలితే దాని ప్రభావం చెర్నోబిల్ పేలుడు కంటే 10 రెట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళన వ్యక్తం చేశారు.
#WATCH | Adviser to the Head of the Office of President of Ukraine Volodymyr Zelenskyy tweets a video of "Zaporizhzhia NPP under fire..."#RussiaUkraine pic.twitter.com/R564tmQ4vs
— ANI (@ANI) March 4, 2022
ఉక్రెయిన్‌కు 25 శాతం పవర్ సప్లై..
ఈ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్‌లో 25 శాతం వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. పవర్ ప్లాంట్‌పై బాంబు దాడి విషయం తెలియగానే అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అప్రమత్తమైంది. ఉక్రెయిన్ అధికారులతో ప్రస్తుత పరిస్థితి వివరాలు తెలుసుకుని తదుపరి చర్యలకు సిద్ధమైంది. మరోవైపు రష్యా అన్ని వైపుల నుంచి జపోరిజియా పవర్ ప్లాంట్‌ను ధ్వంసం చేసేందుకు బాంబు దాడులు కొనసాగిస్తోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైన్యం భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసింది.
కొనసాగుతున్న ఆపరేషన్ గంగ..
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ఆపరేషన్ గంగ ప్రాజెక్టు చేపట్టి ఒక్కో విమానం 200 నుంచి 250 వరకు పౌరులను భారత్‌కు తీసుకొస్తుంది. నేడు సైతం మరో మూడు విమానాలు ఢిల్లీ నుంచి బయలుదేరినట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. గత వారం రోజులుగా పౌరులను స్వదేశానికి తీసుకొస్తున్నారు.
Also Read: Russia-Ukraine Conflict: ఉక్రెయిన్- రష్యా మధ్య రెండో విడత చర్చలు, డిమిలిటరైజేషన్ లక్ష్యమంటున్న రష్యా
Also Read: Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో విద్యార్థులను చూసి చలించిన మనసు- ఆనంద్ మహీంద్ర సంచలన నిర్ణయం