Ukraine Russia War: మాట తప్పను మడమ తిప్పను, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ Video
రాజధానిని పోగొట్టుకునేది లేదని చెప్పిన జెలెన్‌స్కీ కీవ్ నగరంలో సెల్ఫీ వీడియో తీసి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రష్యా బలగాలు దాడులు పెంచినా తాము వెనకడుగు వేసేది లేదన్నారు.
Ukrainia President Zelenskyy: మూడో రోజు సైతం రష్యా తమ దేశంపై దాడులు ముమ్మరం చేసినా ఉక్రెయిన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట తప్పను మడమ తిప్పను అనే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నా, తాను మాత్రం రాజధాని కీవ్ నగరాన్ని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జెలెన్‌స్కీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారని సైతం రష్యా మీడియా ప్రచారం చేసినా ఉక్రెయిన్ మాత్రం పోరాటాన్ని పెంచింది తప్ప తగ్గించలేదు.
మాట ప్రకారం కీవ్‌లోనే ఉంటాను..
రాజధానిని పోగొట్టుకునేది లేదని చెప్పిన జెలెన్‌స్కీ కీవ్ నగరంలో సెల్ఫీ వీడియో తీసి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రష్యా బలగాలు దాడులు (Ukraine Russia War) పెంచినా తాము వెనకడుగు వేసేది లేదన్నారు. దేశాన్ని, రాజధాని కీవ్ నగరాన్ని రష్యా చేతిలోకి వెళ్లకుండా చివరివరకూ పోరాటం కొనసాగిస్తామని వీడియోలో పేర్కొన్నారు. రష్యా సూచించినట్లుగా ఆయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదన్నారు. సాధారణ పౌరులు సైతం యుద్ధ వీరులుగా నిలిచే తరుణమిదని, మీ చేతికి ఆయుధాలు ఇస్తానంటూ దేశ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించారు. తాను సైతం ఆర్మీ డ్రెస్సు ధరించి యుద్ధ రంగంలో అడుగుపెట్టి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
Не вірте фейкам. pic.twitter.com/wiLqmCuz1p
— Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
రష్యా లక్ష్యం నేను, నా ఫ్యామిలీ..
తమ దేశంపై దాడులకు పాల్పడిన రష్యా లక్ష్యం తానేనని ఇటీవల జెలెన్‌స్కీ తెలిపారు. తనతో పాటు తన కుటుంబాన్ని బంధించి ఉక్రెయిన్ ను రాజకీయంగా సర్వనాశనం చేయాలన్నది రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశమని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎక్కడైనా రహస్యంగా తలదాచుకుంటారు, కానీ ఈ సంక్షోభం (Ukraine Russia Conflict)లో రాజధాని కీవ్ నగరాన్ని వీడేది లేదని చెప్పిన జెలెన్‌స్కీ రష్యాపై ప్రతిదాడి చేస్తున్న ఉక్రెయిన్ బలగాలలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. రహస్య ప్రదేశాలలో తలదాచుకోవడానికి బదులుగా రాజధాని కీవ్ లో తిరుగుతూ వీడియోలు, ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న జెలెన్‌స్కీ తీరుపై భిన్న వాదనలు తెరమీదకి వచ్చాయి.
అమెరికా సహాయాన్ని తిరస్కరించిన జెలెన్‌స్కీ..
ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అధ్యక్షుడు జెలెన్‌స్కీని అమెరికా హెచ్చరించింది. కీవ్ నుంచి బయటకు వస్తే సురక్షిత ప్రాంతానికి తరలించి సాయం చేస్తామని అమెరికా చేసిన ఆఫర్‌ను సైతం తిరస్కరించారు. మాకు ఇప్పుడు ఆయుధాలు కావాలి. పోరాడే వీరులు కావాలి, పారిపోయేందుకు నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అని తన అభిప్రాయాన్ని స్పష్టం చేసి శభాష్ అనిపించుకున్నారు.