Pakistan SC : ఇమ్రాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ, ఎల్లుండి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్
Pakistan SC : పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దుపై ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సలహా ఇచ్చే హక్కు ప్రధానికి లేదని కోర్టు తెలిపింది.
Pakistan SC : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చుతూ డిప్యూటీ స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధాని సలహా మేరకు అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడాన్ని పాకిస్థాన్ సుప్రీం కోర్టు గురువారం తోసిపుచ్చింది. తుది తీర్పును ప్రకటిస్తూ అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సలహా ఇచ్చే హక్కు ప్రధానికి లేదని పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్ అన్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన వివాదాస్పద తీర్పు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ప్రకటించింది. ఏకగ్రీవ తీర్పులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం కూడా పార్లమెంటు రద్దును 'రాజ్యాంగ విరుద్ధం' అని ప్రకటించింది. సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుప్రీంకోర్టు వెలుపల అల్లర్ల నిరోధించేందుకు పోలీసులను మోహరించారు. వివాదాస్పద తీర్పు ద్వారా పీఎం ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని కొట్టివేయడానికి డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న చర్య చట్టబద్ధతకు సంబంధించిన కీలకమైన కేసుపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. నాల్గో రోజు విచారణ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రూలింగ్ ప్రాథమికంగా ఆర్టికల్ 95ని ఉల్లంఘించడమేనని చీఫ్ జస్టిస్ బండియల్ పేర్కొన్నారు.
ఏప్రిల్ 9న అసెంబ్లీ సమావేశం
ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తోసిపుచ్చుతూ ఏప్రిల్ 3న నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ తప్పు అని స్పష్టంగా తెలుస్తోందని బండియల్ అన్నారు. అవిశ్వాస తీర్మానం నిర్వహించేందుకు ఏప్రిల్ 9 (శనివారం) ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని పిలవాలని స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, శ్రీలంకలా తయారయ్యే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, బలహీన ప్రభుత్వం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
విదేశీ కుట్ర
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ రద్దుపై నాలుగు రోజుల విచారణ అనంతరం పాకిస్థాన్ సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. వివాదాస్పద తీర్పు ద్వారా ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని కొట్టివేయడానికి నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి తీసుకున్న చర్య ప్రాథమికంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ను ఉల్లంఘించడమేనని కోర్టు గతంలో పేర్కొంది. సంచలనం రేపిన కేసులో ఇవాళ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తులు ఇజాజుల్ అహ్సాన్, మహ్మద్ అలీ మజార్ మియాంఖేల్, మునీబ్ అక్తర్, జమాల్ ఖాన్ మండోఖేల్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ బండియల్ నేతృత్వం వహిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సూరి అవిశ్వాస తీర్మానం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి "విదేశీ కుట్ర"తో ముడిపడి ఉందని, అందువల్ల అది నిర్వహించలేదని కోర్టుకు తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ తీరు రాజ్యాంగ విరుద్ధం
అనంతరం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సలహా మేరకు అధ్యక్షుడు అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. పీటీఐ నేతృత్వంలోని ప్రభుత్వ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించేందుకు 'విదేశీ కుట్ర'కు సంబంధించిన ఆధారాలను చూపుతున్న లేఖపై జాతీయ భద్రతా మండలి చర్చించింది. ఈ సమావేశం మినిట్స్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి బండియల్ కోరారు. న్యాయస్థానంలో జాతీయ భద్రతా కమిటీ సమావేశ వివరాలను ఇవ్వలేనని ప్రభుత్వం గురువారం కోర్టుకు తెలిపింది. ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలమైన తీర్పు వస్తే 90 రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిస్తే పార్లమెంటు మళ్లీ సమావేశమై ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని నిర్వహిస్తుందని నిపుణులు తెలిపారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన వివాదాస్పద తీర్పు రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ జస్టిస్ బండియల్ ప్రకటించారు. ఏప్రిల్ 9న అవిశ్వాస తీర్మానం ఓటింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత నేషనల్ అసెంబ్లీ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకుందని పేర్కొంది.