(Source: ECI/ABP News/ABP Majha)
Pakistan Elections: ఉచితాలకు ప్రజలు వర్కవుట్ కాలేదు.. పాకిస్థాన్ ఎన్నికల తీరు ఎలా ఉంది?
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితం కూడా వచ్చేస్తోంది. అయితే, ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు.. ప్రజలపై ఉచితాల వర్షం కురిపించాయి. కానీ, వర్కువట్ కాలేదు మరి రీజనేంటి?
Pakistan Elections 2024: ప్రజాస్వామ్య(Democracy) దేశాల్లో రాజకీయ పార్టీలు(Political parties) ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ప్రజలను మచ్చిక చేసుకోవడం తెలిసిందే. ఈ విషయంలో ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలదీ అదే తీరుగా మన దేశం(India)లో కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలైతే.. ఉచితాల(Freebees)కు అంతు పొంతులేకుండా పోయింది. ఎలాగైనా విజయం దక్కించుకుందామనే ఒకే ఒక్క వ్యూహంలో ఉచితాలకు మొగ్గు చూపుతున్నాయి. అయితే.. ఈ ఉచితాలతో దేశాలు.. నాశనం అవుతున్నాయని, తద్వారా ఆర్థిక పరిస్థితులు సైతం గతి తప్పుతున్నాయని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ఒకానొక దశలో మన దేశంలో ఉచితాలు వద్దనే స్తాయిలో చర్చ కూడా జరిగింది. దీనిపై సుప్రీంకోర్టులోనూ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ.. దీనిని పార్టీలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు వదిలేసింది. కానీ, ఇక్కడ కూడా.. సూచనలు మాత్రమే వచ్చాయి. ఇదిలావుంటే.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ఉచిత పథకాలకు కొదవ లేకుండా పోతోంది.
పోటాపోటీ ఉచితాలు..
అగ్రరాజ్యం అమెరికా(America) నుంచి ప్రస్తుతం అప్పల్లో కూరుకుపోయి.. నిన్న మొన్నటి వరకు అలో లక్ష్మణా అంటూ.. అగచాట్లు పడ్డ పాకిస్థాన్(Pakistan) వరకు.. ప్రజలకు ఉచిత హామీలు ఇస్తున్నారు. అగ్రరాజ్యం అంటే.. ఆర్థికంగా బలంగానే ఉంది కాబట్టి.. సరే.. అని అనుకోవచ్చు. కానీ, అప్పు లేకపోతే.. తిప్పలు పడాల్సిన పరిస్థితిలో ఉన్న పాకిస్థాన్‌లోనూ ఎన్నికలకు ముందు అన్ని పార్టీలూ.. ఉచితాల మంత్రాన్ని పఠించాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడాలేకుండా అన్ని పార్టీలు.. ఇక్కడ ఉచిత మంత్రాలనే జపించాయి. పాకిస్థాన్ పార్లమెంటు ఎన్నికలు తాజాగా గురువారం ముగిశాయి. ఫలితాలు రావడం ప్రారంభమైంది. దీంతో ఒకరిని మించి.. ఒకరుగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఉచిత హామీలు.. వర్కవుట్ అవుతాయని.. ఎవరు ఎక్కువ ఎన్ని ఉచితాలు ఇచ్చారో.. వారు గెలుస్తారని కొంత వరకు అంచనా వచ్చింది. కానీ, తాజాగా వచ్చిన ఫలితాలు చూశాక.. మాత్రం అందరి అంచనాలు పటాపంచలయ్యాయి.
ఇవీ ఉచితాలు..
పాకిస్థాన్‌లో కీలకమైన పార్టీలు అన్నీ ఉచితాల బాటే పట్టాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో(Benjeer Bhutto) కుమారుడు బిలావల్ భుట్టో(Bilawal bhutto) నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) లెక్కకు మించి ఉచితాలు ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(Free power) ఇస్తామంది. అర్హులైన పేదలకు.. ఇళ్లు కట్టించి ఇస్తామని వాగ్దానం చేసింది. ప్రతి ఒక్కరికీ ఉచితంగా 20 లక్షల వరకు ఆరోగ్య సంరక్షణ బీమా ప్రకటించింది. అందరికీ ఉచిత విద్య, రైతులు, కార్మికుల వేతనాలను రెట్టింపు అయ్యేలాసంస్కరణలు తీసుకువస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.2000 చొప్పున భృతి ఇస్తామన్నారు. మహిళలకు ఉచితంగా పాలు సరఫరా చేస్తామని చెప్పారు. కానీ, ఇవేవీ వర్కవుట్ కాలేదు. 265(ఇంకో చోట అభ్యర్థి మరణంతో వాయిదా వేశారు) స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పీపీపీ కేవలం 21 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరిచి.. 12 చోట్ల మాత్రమే విజయం దక్కించుకుంది.
ఇక, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్(Nawaj sharif) నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(PML-N) పార్టీ కూడా.. ఎన్నికల్లో విజయం కోసం.. అనేక హామీలను వండి వార్చింది. భారత్‌లో అమలవుతున్న ఇంటింటికీ వంట గ్యాస్, మరుగు దొడ్ల నిర్మాణాలను ఉచితంగా ఇస్తామన్నారు. ఏటా 4 సిలెండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు. మహిళల్లో ఆర్థిక స్వావలంబనకు.. నెలకు రూ.3000 పింఛను రూపంలో 20 ఏళ్లు నిండిన వారికి ఇస్తామని చెప్పారు. యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు పరిశ్రమల ఏర్పాటు, వారికి నెలకు రూ.3000 చొప్పున భృతిని ఇస్తామని వాగ్దానం చేశారు. రైతులకు ఉచిత విద్యుత్, ఇంటింటికీ 350 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామన్నారు. కానీ, ఇవి కూడా వర్కవుట్ కాలేదు. ఈ పార్టీకి కేవలం 43 స్థానాల్లోనే విజయం దక్కింది.
ఇక, మాజీ క్రికెటర్.. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్(Imran khan) పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ(PTI) కూడా ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేసింది. దేశవ్యాప్తంగా స్టేడియంలు కట్టించి.. క్రికెట్‌ను ప్రోత్సహిస్తామని.. తెలిపింది. మహిళలకు ఇంటి స్థలంతోపాటు, వంట గ్యాస్‌ను నిరంతరాయంగా ఇస్తామని చెప్పింది. ఉచితంగా ఆహార ధాన్యాలు పంచుతామంది. నిరుద్యోగులకు.. మెరుగైన ఉపాధి వచ్చే వరకు రూ.5000 చొప్పున భృతి ఇస్తామంది. అయితే.. ఎన్నికలకు ముందు ఇమ్రాన్ జైలుకు వెళ్లడంతో ఈ పార్టీని పోటీలో లేకుండా ఎన్నికల సంఘం నియంత్రించింది. అయితే.. ఈ పార్టీ తరఫున అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసినా.. కేవలం 65 స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకున్నారు.
కట్ చేస్తే..
తాజాగా పాకిస్తాన్ ప్రజలు ఇచ్చిన తీర్పు.. ఉచితాలకు చెంపపెట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఏ పార్టీకి కూడా.. పూర్తిస్థాయి మెజారిటీ ఇవ్వలేదు. పైగా పోటీ పడి ప్రకటించిన ఉచితాల వైపు కూడా ప్రజలు మొగ్గు చూపలేదు. కేవలం దేశం బాగుంటే చాలన్నట్టుగా.. అప్పుల ఊబి నుంచి తమను బయటకు పడేస్తే చాలన్నట్టుగా ప్రజా తీర్పు స్పష్టంగా కనిపించింది.