Beep Pakistan: వాట్సప్‌కు పోటీగా ‘బీప్’- కొత్త యాప్ తీసుకొచ్చిన పాక్ !
Beep Pakistan: వాట్సప్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది దీన్ని ఉపయోగిస్తున్నారు. దీనికి పోటీగా పాకిస్థాన్ కొత్త యాప్ తీసుకొచ్చింది.
Beep Pakistan: వాట్సప్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఫోన్‌లో ఈ మెస్సేజింగ్ యాప్ ఉండాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది దీన్ని ఉపయోగిస్తున్నారు. మెస్సేజ్‌ల, ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియో క్లిప్‌లు పంపుకోవచ్చు. ఇంటర్నెట్ సాయంతో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఇటీవలే ఇండియాలో యూపీఐ పేమెంట్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలో ఇతర యాప్‌లతో పోలిస్తే అత్యంత ప్రజాదరణ పొందిన మెస్సేజింగ్ యాప్ ఇది.
దాయాది దేశం పాకిస్తాన్ వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా సొంతంగా మెస్సేజింగ్ యాప్‌ను తయారు చేసింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో దేశంలోని IT మంత్రిత్వ శాఖ ద్వారా తయారు చేసింది. దీనిని పాకిస్థాన్ ఐటీ మంత్రి అమీనుల్ హక్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వాట్సాప్ ప్రత్యామ్నాయంగా పాకిస్తాన్ సొంతంగా యాప్ తయారు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.
బీప్ తయారీ పాక్ ఐటీ పరిశ్రమ మరో మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇతర దేశాలతో పోలీస్తే తాము ఆలస్యం చేశామని, కానీ ఆ ఆలస్యం కారణంగా ఓ మంచి యాప్‌ను డెవలప్ చేయడానికి ఉపయోగపడిందన్నారు. 30 రోజుల పాటు యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు చెప్పారు. బీప్ పూర్తిగా సురక్షితమని, దేశంలో వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందన్నారు. వాట్సాప్ తరహాలో చాటింగ్, ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. అప్లికేషన్‌లో డాక్యమెంట్ షేరింగ్, సెక్యూర్డ్ మెసేజ్, కాన్ఫరెన్స్ కాల్స్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయని, వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా తాము బీప్ యాప్ ఉందని గర్వంగా చెప్పుకుంటామన్నారు.
నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ సీఈఓ బాబర్ మజీద్ భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వ విభాగాల్లో కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ యాప్ దోహదపడుతుందన్నారు. బీప్ యాప్ పాకిస్తాన్ విప్లవాత్మక యాప్ అని, ఇది మంత్రిత్వ శాఖల మధ్య అంతరాయం లేకుండా సేవలు అందించడానికి ఉపయోగపడుతుందన్నారు.
ఈ యాప్‌లో వినియోగదారులు నిల్వ చేసిన డేటా పాకిస్థాన్‌లోని సర్వర్‌లలో మాత్రమే నిల్వ చేయబడుతుందని ఐటీ మంత్రి అమీనుల్ హక్ చెప్పారు. జాతీయ ఐటీ బోర్డు పర్యవేక్షణలో ఈ సర్వర్ పని చేస్తుందని, వినియోగదారుల గోప్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఈ అప్లికేషన్ పూర్తిగా సురక్షితమన్నారు. ప్రస్తుతం ఈ కొత్త మెసేజింగ్ యాప్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉందని, మొదటి దశ కింద పాకిస్థాన్ ఐటీ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, NITB మధ్య అంతర్గత కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. రెండవ దశలో, ఇతర మంత్రిత్వ శాఖల ఉద్యోగులు, మూడో దశలో పాకిస్థాన్ పౌరులకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు.
‘బీప్ పాకిస్థాన్’ చాట్ యాప్ ఫీచర్‌లలో ఆడియో, వీడియో కాల్‌లకు మద్దతు, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, క్యాప్షన్‌లతో డాక్యుమెంట్ షేరింగ్, ఇన్‌స్టంట్ మెసేజింగ్ ఉన్నాయని, ఈ ప్రాజెక్ట్ 2020 సంవత్సరంలో ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. అయితే ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకురావడంపై పాక్ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం పాకిస్తాన్‌లో మాత్రమే ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది. బీప్ యాప్ ఏపీకే ఫైల్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని, దానికి సంబంధించిన లింక్‌ను షేర్ చేశారు. ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి. ప్లే స్టోర్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ ఏపీకేలను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడం ఫోన్‌కు ప్రమాదకరం.