Pakistan Army Chief: పాకిస్తాన్ కీలక నిర్ణయం, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్
Pakistan Army Chief Field Marshal | జనరల్ ఆసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేసింది పాక్. భారత్ తీవ్రమైన దౌత్య ఒత్తిడి తెస్తున్న సమయంలో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ (COAS) జనరల్ ఆసిమ్ మునీర్‌ను ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోట్ చేయడానికి ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జియో న్యూస్ ప్రకారం, "దేశ భద్రతను పెంచడానికి, 'ఆపరేషన్ బున్యాన్-ఉమ్-మర్సూస్' (Operation Bunyan-um-Marsoos) సమయంలో అత్యుత్తమ వ్యూహాలు, ధైర్యవంతమైన నాయకత్వం ద్వారా శత్రువుపై విజయం సాధించడానికి పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రిపోర్ట్ చేసింది.
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ పాకిస్తాన్ చరిత్రలో ఫీల్డ్ మార్షల్ అనే ప్రతిష్టాత్మకమైన ఐదు నక్షత్రాల ర్యాంక్ (Five Star Rank)ను పొందిన రెండవ వ్యక్తి అయ్యాడు. కాగా, ఈ హోదా పొందిన మొదటి వ్యక్తి జనరల్ అయుబ్ ఖాన్. అయితే, అయుబ్ ఖాన్ తనకు తానుగా ఈ హోదా ప్రకటించుకోగా, ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ పదోన్నతికి పాక్ క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది.
పాక్ ఉగ్రవాదానికి చెక్ట పెట్టేందుకు భారత్ గ్లోబల్ డిప్లొమాటిక్ క్యాంపెయిన్
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్ పాత్రను బహిర్గతం చేయడానికి భారత ప్రభుత్వం దౌత్య పరమైన క్యాంపెయిన్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పలు పార్టీల ఎంపీల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసింది. వారి నేతృత్వంలో ఎంపీల టీమ్స్ అమెరికా, యూకే, యూఏఈ లాంటి దేశాలు వెళ్లి అక్కడి అధికారులకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని వివరించనున్నారు. జనతాదళ్ (యునైటెడ్) నేత సంజయ్ కుమార్ జా నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం తూర్పు దేశాలకు వెళ్లనుంది.
బుధవారం విదేశాలకు ఓ ఎంపీ బృందం
న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్ ప్రకారం, "ఆ ఎంపీల బృందం జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్‌కు వెళ్తుంది" ఈ విషయాన్ని జా పాట్నా విమానాశ్రయంలో మంగళవారం మీడియాకు తెలిపారు. పాకిస్తాన్ అసలు రూపాన్ని, ఉగ్రవాదం మూలాలు పాక్ లో ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం చేయడానికి ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్తాయి.
'ఆపరేషన్ సింధూర్' చేపట్టడానికి గల కారణాలను ప్రపంచ వేదికగా భారత్ చాటి చెప్పనుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఒంటరిని చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విపక్ష పార్టీల ఎంపీలను సైతం ఇందులో బాగం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్య దేశాలతో సమావేశమై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం, ఉగ్రవాదులకు పాక్ ఆర్థిక సాయం, ఆయుధాల సరఫరా, స్థావరాల వివరాలను నేతలు వివరించనున్నారు.
దేశం కోసం పార్టీలకతీతంగా పోరాటం
సంజయ్ కుమార్ జా నేతృత్వంలోని నేతల బృందంలో బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, అభిషేక్ బెనర్జీ ఉన్నారు. పార్టీలకు అతీతంగా భారత పౌరులుగా, దేశ ప్రతినిధులుగా విదేశాలకు వెళుతున్నామని ఝా తెలిపారు. పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న చర్యను 'యుద్ధ చర్య'గా పరిగణించడానికి కారణాలను ప్రపంచానికి చాటి చెప్పనున్నారు. ఉగ్రవాదంపై పోరుకు దేశమంతా ఏకమవుతుందని ఈ నేతల బృందాలు నిరూపించనున్నాయి.





















