ఫ్యుయెల్ కొనుక్కోడానికి డబ్బుల్లేక ఆగిన ఫ్లైట్‌లు, పాపం పాకిస్థాన్
Pakistan Airlines: ఫ్యుయెల్ కొనడానికి డబ్బుల్లేక పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ 48 ఫ్లైట్‌లను రద్దు చేసింది.
Pakistan International Airlines:
చమురు లేదు..
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంది. సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్‌తో పాటు చమురు ధరలూ ప్రియమైపోయాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. Pakistan International Airlines (PIA) కి చెందిన 48 ఫ్లైట్‌లను పూర్తిగా రద్దు చేసింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీస్‌లు నిలిపివేసింది. విమానాలు నడపాలంటే ఇంధనం అవసరం కదా. మరి ఆ చమురే ఇప్పుడక్కడ బంగారమైపోయింది. తీవ్ర కొరత ఏర్పడింది. అందుకే...అన్ని విమానాలనూ పక్కన పెట్టేసింది. సరిపడినంత ఇంధన సరఫరా లేకపోవడం వల్లే ఫ్లైట్‌లను రద్దు చేయాల్సి వచ్చిందని PIA ప్రతినిధులు వెల్లడించారు. పాకిస్థాన్ మీడియా కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. చాలా వరకూ ఫ్లైట్స్‌ని రీషెడ్యూల్ చేశారు. రద్దైన సర్వీస్‌లలో 13 డొమెస్టిక్ ఫ్లైట్స్, 11 ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లు ఉన్నాయి. మరో 12 విమానాలు డిలే అయ్యాయి. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లకి ప్రత్యామ్నాయం చూపిస్తోంది కంపెనీ. ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే ముందే ఫ్లైట్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
ఎందుకీ కొరత..?
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కి ప్రభుత్వం అధీనంలో ఉన్న Pakistan State Oil (PSO) ఫ్యుయెల్ సప్లై చేస్తోంది. అయితే చాలా రోజులుగా డబ్బులు కట్టకుండా పెండింగ్‌లో ఉంచింది ఎయిర్‌లైన్స్. ఇప్పటికే నష్టాల్లో నడుస్తుండటం వల్ల ప్రభుత్వానికి అంత మొత్తం చెల్లించలేకపోయింది. అందుకే ఉన్నట్టుండి సప్లైని కట్ చేసేసింది పాకిస్థాన్ స్టేట్ ఆయిల్. ఫలితంగా..ఎయిర్‌లైన్స్ భవిష్యత్ గందరగోళంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మెల్లగా ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్నారు. ఈ సమస్యకు తోడు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సాయమూ అందలేదు. 23 బిలియన్ డాలర్లు మేర ఇవ్వాల్సి ఉన్నా..అందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పటికిప్పుడు ఆ ఎయిర్‌లైన్స్ నష్టాల ఊబిలో నుంచి బయటపడాలంటే కనీసం 100 మిలియన్లు చెల్లించాల్సిందే. ఇప్పటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే...క్రమంగా ఎయిర్‌లైన్స్‌ని పూర్తిగా మూసేసే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.