Nobel Prize 2023: కరోనా సమయంలో సేవలకు అత్యుత్తమ గుర్తింపు, నోబెల్ పురస్కారంతో సత్కారం
Nobel Prize 2023: కరోనా వ్యాక్సిన్ల తయారీలో కీలక పాత్ర పోషించినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్ వరించింది.
![Nobel Prize 2023: కరోనా సమయంలో సేవలకు అత్యుత్తమ గుర్తింపు, నోబెల్ పురస్కారంతో సత్కారం Nobel Prize 2023 In Physiology Medicine Awarded to Katalin Kariko Drew Weissman COVID-19 mRNA Vaccines Nobel Prize 2023: కరోనా సమయంలో సేవలకు అత్యుత్తమ గుర్తింపు, నోబెల్ పురస్కారంతో సత్కారం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/7a03615e4067e1e343905722580bf0871696244682581754_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nobel Prize 2023: కరోనా సమయంలో విశేష కృషి చేయడంతో పాటు కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్ కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరిద్దరూ ఎంతో కృషి చేశారు. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలకు గానూ స్వీడన్ లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ (mRNA) వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్ లోని స్టాక్ హోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్‌స్టిట్యూట్ లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది.
హంగేరీకి చెందిన కాటలిన్ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు.. అవి ప్రతి చర్యను అడ్డుకోవడంతో పాటు, శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయని వీరు తమ పరిశోధనలో గుర్తించారు. కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్ ఇద్దరూ 2005లోనే ఓ పేపర్ ను కూడా పబ్లిష్ చేశారు. అప్పట్లో వారి పరిశోధనకు పెద్దగా గుర్తింపు రాలేదు. కరోనా సమయంలో మాత్రం వ్యాక్సిన్ల అభివృద్ధిలో వీరి పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి. వీరు అప్పట్లో చేసిన పరిశోధనల వల్లే 2020 చివర్లో రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది.
వారం పాటు కొనసాగనున్న నోబెల్ పురస్కారాల ప్రదానం
కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్ పరిశోధనల ఫలితంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నిరోధించాయి. అలాగే కోట్లాది మంది ప్రాణాలను కూడా కాపాడగలిగాయి అని నోబెల్ బృందం పురస్కార ప్రకటన వేళ వెల్లడించింది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారం పాటు కొనసాగనుంది. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో నోబెల్ గ్రహీతలు పేర్లను ప్రకటించనున్నారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9వ తేదీన అర్ధశాస్త్రంలో నోబెల్ పురస్కార విజేతల పేర్లను వెల్లడించనున్నారు.
ఈసారి నగదు బహుమతిని పెంచారు
నోబెల్ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ సంవత్సరం పెంచారు. గత సంవత్సరం నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు అందజేశారు. ఈ సారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లకు పెంచారు. ఈ మధ్యకాలంలో స్వీడిష్ కరెన్సీ విలువ పడిపోతోంది. ఈ నేపథ్యంలో నోబెల్ పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు విలువను పెంచారు. ఇప్పుడు ప్రకటించే నోబెల్ పురస్కారాలను ఈ ఏడాది ఆఖర్లో డిసెంబర్ 10వ తేదీన గ్రహీతలకు అందించనున్నారు. స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని అందిస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించారు. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తూ వస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)