NZ PM Stepping Down:: ఫిబ్రవరి 7లోగా నా పదవికి రాజీనా చేస్తా: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా
NZ PM Stepping Down: న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఫిబ్రవరి 7వ తేదీలోగా రాజీనామా చేస్తానన్నారు.
NZ PM Stepping Down: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అనూహ్య ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 7వ తేదీలోగా తన పదవికి రాజీనామా చేస్తానని గురువారం ప్రకటించారు. జెసిండా 2017వ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఎన్నికయ్యారు. 37 సంవత్సరాల వయస్సులో, జసిండా ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా దేశాధినేతగా.. ప్రగతిశీల పాలన అందించారు. ఐదున్నరేళ్ల పాలన తర్వాత జెసిండా ఆర్డెర్న్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా కల్లోలం, అత్యంత దారుణ స్థాయిలో జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె పాటించిన సంయమనం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. అలాగే ఆమె రాజీనామా చేస్తానని ప్రకటించి ప్రపంచాన్నే షాక్ కు గురి చేసింది. అయితే తనకిప్పుడు దేశానికి నాయకత్వం వహించే శక్తి లేదని జెసిండా ఆర్డెర్న్ అన్నారు. వేసవి సెలవుల్లో దీని గురించి ఆలోచించానని.. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తి స్థాయిలో లేనప్పుడు కొనసాగలేం..!
ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైందని.. అయితే అది అత్యంత సవాళ్లతో కూడుకున్న పని అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తి స్థాయిలో లేనప్పుడు కొనసాగలేమన్నారు. మీరు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తా, కాదా అనేది తెలుసుకోవడం కూడా ఒక బాధ్యతే అని ప్రధాని వివరించారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావించడం వల్ల తాను ఈ పదివిని వీడడం లేదని, ఎందుకంటే మనం విజయం సాధించగలమని తాను విశ్వసిస్తున్నట్లు లేబర్ పార్టీ సభ్యులతో మాట్లాడారు. తన రాజీనామా వెనుక ఎలాంటి రహస్యం లేదని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు. మరో పక్క ఈ సమయం వరకు కొత్త ప్రధానిని జనవరి 22వ తేదీన ఎన్నుకోనున్నారు.
కరోనాతో పాటు, హింసాకాండను సమర్థంగా ఎదుర్కున్న జెసిండా
ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ, వ్యక్తిగత ప్రజాదరణ పడిపోయినట్లు వెల్లడి అయింది. ఇదిలా ఉండగా.. 2019లో క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ఆమె వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. ఆ ఘటనలో 51 మంది ముస్లింలు ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 40 మంది గాయపడ్డారు. ఆ హింసాకాండకు ఆమె ఎంతగానో చలించిపోయారు. అలాగే ప్రకృతి విపత్తు, కోరనా కల్లోల్లాన్ని ఆమె సమర్థంగా ఎదుర్కున్నారు.
మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన జెసిండా ఆర్డెర్న్ నార్త్ ఐల్యాండ్ హింటర్ ల్యాండ్ లో పెరిగారు. ఆమె తండ్రి పోలీసుగా పని చేస్తుండేవారు. కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. బ్రిటన్ లోని బ్లయర్ ప్రభుత్వంలో పాలసీ అడ్వయిజర్ గానూ గతంలో జెసిండా పని చేశారు. అంతకు ముందు న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లర్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. 2008లో పార్లమెంట్ మెంబర్ గా జెసిండా ఎన్నికయ్యారు. 2017లో లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ గా బాధ్యతలు చేపట్టారు.