Nepal lifted Ban on Social Media: యువత ఆందోళనతో దిగొచ్చిన నేపాల్ ప్రభుత్వం, సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
Nepal ban on Social Media: జెన్ జెడ్ యువత చేసిన నిరసనలతో నేపాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియాపై నిషేధం నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని మంత్రి పృథ్వీ గురుంగ్ తెలిపారు.

Nepal Government lifted Ban on Social Media: ఖాట్మండు: సోషల్ మీడియాపై నిషేధం విషయంలో నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని నేపాల్ ప్రభుత్వం తొలగించింది. సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం (2025 సెప్టెంబర్ 8) జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, గతంలో తీసుకున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాపై నిషేధం నిర్ణయం విషయంలో ప్రభుత్వానికి ఏ మాత్రం పశ్చాత్తాపం లేదన్నారు. జెన్ జె నిరసనలతో హోరెత్తించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
నేపాల్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నేపాల్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అవకాశంగా తీసుకుని ఆందోళనలు చేస్తున్న కొన్ని వర్గాల కారణంగా సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేశాం. కొన్ని నిషేధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల నుంచి వచ్చిన స్పందనలు నేపాల్ జాతీయ గౌరవాన్ని అవమానించాయని అన్నారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వెనుక ప్రధాన కారణాలు ఉంటాయని, ఈ విధంగా ఆందోళన చేయడం సరికాదని యువతకు సూచించారు.
ఆందోళనల్లో ప్రాణ నష్టం..
సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్‌లో జరిగిన అల్లర్లు, ఆందోళనల్లో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మంత్రి పృథ్వీ గురుంగ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించి సోషల్ మీడియా సైట్లపై నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
#WATCH | Kathmandu, Nepal | Protestors climb over police barricades as they stage a massive protest against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites. pic.twitter.com/mHBC4C7qVV
— ANI (@ANI) September 8, 2025
ఖాట్మండ్ పార్లమెంట్ ఎదుట పెద్ద సంఖ్యలో ఆందోళన నిర్వహించిన 'జెన్ జెడ్' గ్రూప్ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వారికి ఊరట కలిగించింది. సంబంధిత సంస్థలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది.
నేపాల్‌లో 26 సోషల్ మీడియా సైట్లపై నిషేధం
3 రోజుల కిందట నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, ఎక్స్ (Twitter)తో పాటు మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో పాల్గొన్న 'జెన్ జెడ్' యువతను శాంతించాలని మంత్రి గురుంగ్ కోరారు.
సోమవారం రాజధాని ఖాట్మండ్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కొందరు నిరసనకారులు ఏకంగా పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. దీంతో, పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. వారిని చెదరగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. యువత ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగడంతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో సోమవారం రాత్రి నుండి ఫేస్‌బుక్, ఎక్స్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి.






















