Marriage Equality: ఆ దేశాల్లో స్వలింగ జంటలు పెళ్లి చేసుకోవచ్చు ! అవి ఏంటంటే?
Marriage Equality: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత, ధ్రువీకరణపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. LGBTQIA+ వర్గాలకు చెందిన వ్యక్తుల వివాహానికి తాము చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది.
Marriage Equality: స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత, ధ్రువీకరణపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. LGBTQIA+ వర్గాలకు చెందిన వ్యక్తుల వివాహానికి తాము చట్టబద్ధత కల్పించలేమని తెలిపింది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. వారు సహజీవనంలో ఉండొచ్చని పేర్కొంది. తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని 20 స్వలింగ జంటలు వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4 వేర్వేరు తీర్పులను వెల్లడించింది.
దీనిపై పార్లమెంటే చట్టం చేయాలన్ని ధర్మాసనం, స్వలింగ సంపర్కం జంటలపై ఎలాంటి వివక్ష చూపించొద్దని, వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో దేశంలో మరోసారి స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత అంశం ట్రెండింగ్‌లో ఉంది.
అయితే స్వలింగ సంపర్కుల వివాహాం అనేది ప్రాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాయి. 30కి పైగా దేశాల్లో ప్రస్తుతం సంపర్కుల వివాహానికి అనుమతి ఉంది. అయితే స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేసిన మొట్ట మొదటి దేశం నెదర్లాండ్. 2001లో నెదర్లాండ్ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ తర్వాత ఉరుగ్వే, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఐస్ ల్యాండ్, అర్జెంటీనా, ఇంగ్లండ్ వేల్స్, స్కాట్లాండ్, లక్సెంబర్గ్, ఐర్లాండ్, అమెరికా, ఫిన్ ల్యాండ్, జర్మనీ, మల్టా, ఆస్ట్రేలియా, తైవాన్, ఈక్వెటార్, ఆస్ట్రియా, ఐర్లాండ్, కోస్టారికా, చిలీ, క్యూబా, స్విడ్జర్లాండ్, మెక్సికో, స్లొవేనియా, అండోరా, ఎస్టోనియా దేశాలు స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి.
అయితే ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాలు స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు 41 దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేటికి నేరంగానే పరిగణిస్తున్నాయి. స్వలింగ సంపర్కులు వివాహాలు చేసుకున్న వారిని నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు జైలుకు పంపించాయి.
ఇండియాలో 2001 తరువాత స్వలింగ సంపర్కుల వివాహాల గురించి చర్చ నడుస్తోంది. 2001లో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ఎన్‌ఏజడ్ ‘నాజ్’ ఫౌండేషన్ మొట్టమొదటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హై కోర్టు 2004లో దానిని డిస్మిస్ చేసింది. 2009లో అదే ఢిల్లీ హై కోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు చెప్పింది. 2013లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలా ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఏదో ఒక పిల్ నడుస్తూనే ఉంటోంది.
బ్రిటిష్ పాలనలో స్వలింగ సంపర్కుల వివాహాలపై చర్చ జరిగింది. 1860వ సంవత్సరంలో స్వలింగ సంపర్కానికి సంబంధించిన ఐపీసీ 377 సెక్షన్ భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టారు. ప్రవేశ పెట్టిన తర్వాత 1861 నుంచి ఇది అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఎవరైన ప్రకృతికి విరుద్దంగా ఎవరైనా ఇద్దరు పురుషులు గాని, ఇద్దరు స్త్రీలు గాని లైంగికంగా సహాజీవనం చేస్తే వారికి జీవిత కాల శిక్షార్హులు అని ఆదేశాలు జారీ చేసింది.