Israel - Hamas Deal: బందీల విడుదలకు బదులుగా కాల్పుల విరమణ - హమాస్ డీల్‌కు ఇజ్రాయెల్ అంగీకారం
హమాస్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించింది. 50మంది బందీల విడుదలకు బదులుగా.. గాజాలో నాలుగు రోజుల కాల్పుల విరమణ డీల్‌కు ఆమోదం తెలిపింది.
Israel-Hamas deal: బందీల విడుదలకు హామాస్ పెట్టిన డీల్‌కు అంగీకరించింది ఇజ్రాయెల్. హమాస్ ఉగ్రవాదులతో కాల్పుల విరమణకు ఒప్పుకుంది. గాజాలో నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనుంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిని ప్రారంభించిన హమాస్... గాజాలో 200 మందికిపైగా బందీలుగా ఉంచుకుంది. బందీలుగా ఉన్న వారిలో 50మంది విడుదల కోసం హమాస్‌తో ఒప్పందంపై ఇజ్రాయెల్ క్యాబినెట్ అంగీకరించింది. నాలుగు రోజులపాటు కాల్పుల విరమణకు బదులుగా.. రోజుకు 12 నుంచి 13 చొప్పున నాలుగు రోజుల్లో 50మంది బందీల విడుదలకు హమాస్ కూడా అంగీకరించిందని సమాచారం.
రేపటి నుండి దశలవారీగా 50 ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది హమాస్. విడుదలవుతున్న బందీల్లో 20 మంది మహిళలు, 30 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ఒకవేళ అదనంగా 10 మందిని విడుదల చేస్తే... అప్పుడు కాల్పుల విరమణను మరో రోజు పొడిగించనున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న సుమారు 150 మంది పాలస్తీనియన్లను కూడా విడిచిపెడుతారని హమాస్ భావిస్తోంది.
హమాస్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలై ఏడు వారాలు దాటింది. మొదటిసారిగా ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పుల విమరణకు అంగీకరించింది. కాల్పుల విరమణ సమయంలో గ్రౌండ్ ఆపరేషన్‌తోపాటు వైమానిక దాడులను కూడా నిలిపివేయనున్నారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఈ డీల్‌లో ఖతార్ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ ఒప్పందం ప్రకారం... ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్ అనుమతిస్తుందని భావిస్తున్నారు. అయితే... ఎంతమందిని విడుదల చేయబోతోందో ఇజ్రాయెల్ ఇంతవరకు వెల్లడించలేదు. ఇక.. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ అదనపు ఇంధనాన్ని, గాజాకు మానవతా సహాయాన్ని అందించేందుకు అంగీకరించింది.
హమాస్ తన దగ్గర ఉన్న బందీలను మొదట రెడ్‌క్రాస్‌కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత వారిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) దళాలకు అప్పగిస్తారు. ఆ తర్వాత.. బందీలకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి... వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మరోవైపు... బందీలను విడిచిపించిన తర్వాత కూడా యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టంచేశారు. తమ లక్ష్యం సాధించే వరకు యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటివరకూ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 14వేలకు పైనే ఉందని హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.