మణికట్టుకి బ్రేస్‌లెట్‌లు, మోచేతులపై పేర్లు - తమ వాళ్లను గుర్తు పట్టేందుకు పాలస్తీనా పౌరుల అవస్థలు
Israel Palestine Attack: శిథిలాల కింద నలిగిపోతున్న వాళ్లను గుర్తు పట్టేందుకు వీలుగా గాజా పౌరులు బ్రేస్‌లెట్‌లు ధరిస్తున్నారు.
Israel Palestine Attack:
ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం..
ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం (Israel Hamas War) కారణంగా గాజాలోని ప్రజలు వణికిపోతున్నారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. దాడుల్లో భవనాలు నేలమట్టం అవుతున్నాయి. ఆ శిథిలాల కిందే వందలాది మంది నలిగిపోతున్నారు. వాళ్ల మృతదేహాల్ని గుర్తించి వెలికి తీయడం కష్టమైపోతోంది. చాలా మంది ముఖాలు ఛిద్రమైపోయాయి. కుటుంబ సభ్యులు కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి ఆ డెడ్‌బాడీస్. వాళ్ల పేర్లను కనుక్కోవడం దాదాపు అసాధ్యమే అని చెబుతోంది ఇజ్రాయేల్ సైన్యం. అందుకే...పాలస్తీనా ప్రజలు తమ వాళ్ల ఆచూకీని కనిపెట్టడానికి తోచిన మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇజ్రాయేల్ దాడుల్లో చనిపోతే వాళ్లను ఎలా గుర్తు పట్టాలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులంతా చేతులకు స్పెషల్ బ్రేస్‌లెట్స్ కట్టుకుంటున్నారు. ఒకవేళ ఎక్కడైనా శిథిలాల కింద నలిగిపోయినా, చనిపోయినా వెంటనే గుర్తు పట్టేందుకు వీలుగా ఇలా బ్రేస్‌లెట్స్ పెట్టుకుంటున్నారు. "మా వాళ్లకి ఏమైనా జరిగితే గుర్తు పట్టలేకపోతున్నాం. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాం" అని చాలా ఆవేదనతో చెబుతున్నారు పాలస్తీనా పౌరులు.
ఐడీ బ్రేస్‌లెట్స్..
ఇప్పటికే చాలా మంది ఈ ఐడెంటిఫికేషన్ బ్రేస్‌లెట్స్‌ని వినియోగిస్తున్నారు. మోచేతులపై తమ పేర్లు రాసుకుంటున్నారు. అంతే కాదు. శరీరంపై స్పష్టంగా కనిపించేలా కొన్ని స్పెషల్ మార్క్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఇంకా ఆవేదన కలిగించే విషయం ఏంటంటే..కుటుంబ సభ్యులంతా ఒక్కచోటే ఉంటే దాడుల్లో అందరూ చనిపోతున్నారు. ఇలా అందరూ చనిపోకుండా ఉండేందుకూ అక్కడి పౌరులు ఓ మార్గం ఎంచుకున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో చోట తల దాచుకుంటున్నారు. తల్లిదండ్రులు ఓ చోట..పిల్లలు మరో చోట ఉంటున్నారు. ఇది వినడానికే ఇంత కష్టంగా ఉంటే...వాళ్లు ఇంకెంత మనోవేదనకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఈ దాడుల్లో బలి అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.