గాజాని ఆక్రమించాలన్న ఆలోచన మానుకుంటేనే మంచిది, ఇజ్రాయేల్‌కి బైడెన్ వార్నింగ్!
Israel Palestine Attack: గాజాని ఆక్రమించుకోవాలనుకోవడం పెద్ద తప్పు అని ఇజ్రాయేల్‌ని బైడెన్ మందలించారు.
Israel Palestine War:
ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం..
ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంపై (Israel Hamas War) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాజాని ఆక్రమించుకోవడం ఇజ్రాయేల్‌కి అంత మంచిది కాదని స్పష్టం చేశారు. ఇజ్రాయేల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) యుద్ధంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన తరవాత బైడెన్ ఈ కామెంట్స్ చేశారు. హమాస్‌తో యుద్ధం ముగిసిన తరవాత పాలస్తీనా భద్రత బాధ్యత తామే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడి అభిప్రాయాన్ని ఆ దేశ National Security Council ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు.
"ఇజ్రాయేల్ సైన్యం గాజాని తిరిగి ఆక్రమించుకోవడం సరికాదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇలా చేయడం వల్ల ఇజ్రాయేల్‌కి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని, ఇజ్రాయేల్ పౌరులకూ ఇది మంచిది కాదని వెల్లడించారు. సెక్రటరీ బ్లింకెన్ కూడా ఈ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్ పూర్తైన తరవాత గాజా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోడానికే కష్టంగా ఉంది. అక్కడి పరిపాలనా వ్యవస్థ ఎలా ఉంటుందో? ఏదేమైనా అక్టోబర్ 7 ముందు నాటి పరిస్థితులైతే పాలస్తీనాలో ఉండకపోవచ్చు"
- జాన్ కిర్బీ, అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి
పెద్ద తప్పు..
గత నెల CBSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ దాదాపు గంట పాటు ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం గురించి మాట్లాడారు. గాజా ఆక్రమణపై ఇజ్రాయేల్‌కి వార్నింగ్ కూడా ఇచ్చారు. గాజాని ఆక్రమించడం కన్నా పెద్ద తప్పు ఇంకేదీ ఉండదని స్పష్టం చేశారు. అయితే...గాజాని ఆక్రమించాలన్న ఉద్దేశం తమకు లేదని ఇజ్రాయేల్ స్పష్టం చేసింది. గత వారమే యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోని బ్లింకెన్ ఇజ్రాయేల్‌లో పర్యటించారు. నెతన్యాహూతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇజ్రాయేల్‌కి అమెరికా ఎప్పుడూ మద్దతుగానే ఉంటుందని ప్రకటించారు. అయితే...ప్రస్తుతానికి యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని, అలా అయితేనే పాలస్తీనా ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు వీలవుతుందని సూచించారు. కానీ నెతన్యాహు అందుకు అంగీకరించలేదు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే విషయమై నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదు.
రెండు ముక్కలైన గాజా..
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయేల్ దాడులు (Israel Hamas War) కొనసాగిస్తోంది. వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది పౌరులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. పూర్తి స్థాయిలో గాజాపై పట్టు సాధించేంత వరకూ దాడులు ఆపేదే లేదని స్పష్టం చేస్తోంది ఇజ్రాయేల్. ఈ క్రమంలోనే మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. గాజాని పూర్తిగా చుట్టుముట్టామని తేల్చి చెప్పింది. అంతే కాదు. ప్రస్తుతం ఈ ప్రాంతం నార్త్ గాజా, సౌత్ గాజాగా విడిపోయిందని, రెండు ముక్కలైపోయిందని స్పష్టం చేసింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడి చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (Israel Defence Forces) రంగంలోకి దిగి గాజాని చుట్టుముట్టాయి. తమ యుద్ధంలో ఇది చాలా కీలకమైన దశ అని ఇజ్రాయేల్ ప్రకటించింది. గాజాని చీల్చేశామని వెల్లడించింది.
Also Read: జనాభా నియంత్రణపై అసెంబ్లీలో నోరు జారిన నితీశ్, ఆ తరవాత క్షమాపణలు