జనాభా నియంత్రణపై అసెంబ్లీలో నోరు జారిన నితీశ్, ఆ తరవాత క్షమాపణలు
Nitish Kumar: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నితీశ్ కుమార్ ఆ తరవాత సారీ చెప్పారు.
CM Nitish Kumar:
వివాదాస్పద వ్యాఖ్యలు
జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ తరవాత క్షమాపణలు చెప్పారు. తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. జనాభా నియంత్రణ విషయంలో మహిళల అవగాహన గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో నోరు జారారు నితీశ్. రాష్ట్రంలో ఫర్టిలిటీ రేట్ 4.2% నుంచి 2.9%కి పడిపోయింది. దీనిపై చర్చిస్తున్న సమయంలోనే కాస్త వివాదాస్పద భాష వాడారు. దీనికి వివరణ ఇస్తూ "నా వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బ తిని ఉంటే క్షమించండి. ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను" అని చెప్పారు.
ఏమన్నారంటే..?
"మగాళ్ల కారణంగానే సంతానం పెరుగుతోంది. కానీ మహిళలకు జనాభా నియంత్రణపై అవగాహన పెరిగితే తమ భర్తల్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థమవుతుంది. బహుశా ఈ కారణంగానే రాష్ట్రంలో ఫర్టిలిటీ రేట్ తగ్గుతోందేమో. జర్నలిస్ట్‌లకు కూడా ఇది బాగానే అర్థమవుతుందనే అనుకుంటున్నాను. గతంలో ఫర్టిలిటీ రేటు 4.3గా ఉంది. ఇప్పుడది 2.9కి తగ్గిపోయింది. త్వరలోనే ఇది 2%కి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం"
- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
#WATCH | Bihar CM Nitish Kumar says, "I apologise & I take back my words..." pic.twitter.com/wRIB1KAI8O
— ANI (@ANI) November 8, 2023
నితీశ్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నితీశ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని దేశంలోని ప్రతి మహిళ తరపున తాము డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఆయన వాడిన భాషపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
"నితీశ్ కుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలి. దేశంలోని అందరి మహిళల తరపున మా డిమాండ్ ఇదే. అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన భాష చాలా దారుణంగా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఓ నేత ఇలాంటి మాటలు మాట్లాడారంటే ఆ రాష్ట్రం ఎలాంటి వ్యక్తుల చేతుల్లో ఉందో ఊహించుకోవచ్చు"
- జాతీయ మహిళా కమిషన్
ఈ వయసులో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడమేంటని బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. కొందరు మహిళా నేతలు నితీశ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ మాత్రం నితీశ్‌ని వెనకేసుకొచ్చారు. ఆయన కేవలం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారని వివరించారు. జనాభా నియంత్రణకు ప్రాక్టికల్‌గా ఏం చేయాలన్నది నితీశ్ చెప్పారని, ఇందులో తప్పు పట్టాల్సిన పనేమీ లేదని అన్నారు.