Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం - అగ్రరాజ్యంలో భారత మహిళల ‘కడుపు కోత’, 7 నెలలకే..
Donald Trump: అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వాన్ని దక్కించుకునేందుకు అక్కడి భారతీయ మహిళలు ముందుగానే సిజేరిన్లు (సి–సెక్షన్) చేయించుకునేందుకు డాక్టర్లను సంప్రదిస్తున్నారు.

Donald Trump Birthright Citizenship Executive Order: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి జన్మతః వచ్చే పౌరసత్వాన్ని (బర్త్ రైట్ సిటిజన్ షిప్) రద్దు చేయడం. 127 ఏళ్లుగా వస్తున్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. ఫలితంగా అమెరికాలో ఉంటున్న విదేశీ మహిళలు అక్కడ ప్రసవిస్తే వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కు రద్దవుతుంది. ఈ నిర్ణయంతో హెచ్1బీ, ఎల్1 వీసాలపై అక్కడ ఉంటున్న లక్షలాది భారతీయ కుటుంబాలు గందరగోళంలో పడ్డాయి. మరీ ముఖ్యంగా గర్భిణుల కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.
ఫిబ్రవరి 20 లోపు కనాలని..
ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆర్డర్స్ అమలు కానున్న నేపథ్యంలో.. అంతకు ముందే పిల్లల్ని కని వారికి అమెరికా పౌరసత్వం కల్పించాలని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. దీంతో ముందుగానే సిజేరిన్లు (సి–సెక్షన్) చేయించుకునేందుకు డాక్టర్లను సంప్రదిస్తున్నారు. సిజేరియన్ల కోసం ఆస్పత్రులకు వెళ్లే భారతీయ మహిళల సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 8వ నెలతో ఉన్న ఎంతోమంది భారతీయ గర్భిణులు తమకు సిజేరియన్ చేయాల్సిందిగా పలు ఆస్పత్రుల్లో అంగీకార పత్రాలిస్తున్నారని, 7 నెలల గర్భంతో ఉన్న వాళ్లు కూడా హాస్పిటల్స్ కు పరుగులు తీస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
పౌరసత్వం కోసం
ఫిబ్రవరి 20వ తేదీలోపు బిడ్డలకు జన్మనిస్తే వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. లేదంటే 21 ఏళ్లు వచ్చే సరికి వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో తండ్రి లేదా తల్లికి పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు వస్తే పిల్లలు అక్కడే ఉండవచ్చు. పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు వస్తుందో రాదో అనే భయంతో పిల్లల్ని ముందుగానే కనేయాలని సిజేరిన్ల కోసం ఆస్పత్రులను సంప్రదిస్తున్నారు. తమకు పౌరసత్వం లేకపోయినా, అమెరికా గడ్డపై పుట్టే తమ బిడ్డలకు పౌరసత్వం ఉండాలని భావిస్తున్నారు తల్లిదండ్రులు.
శిశువులకు అనారోగ్య సమస్యలు
అయితే.. ఇలా ముందుగానే పిల్లలకు జన్మనిస్తే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శిశువుల్లో ఊపిరితిత్తుల సమస్యలు, ఫీడింగ్ సమస్యలు, తక్కువ బరువుతో పుడతారని సిజేరియన్ల కోసం కన్సల్ట్ అయ్యే తల్లిదండ్రులకు డాక్టర్లు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
చట్టవిరుద్ధంగా 14 మిలియన్ల మంది నివాసం
1868లో జన్మతః పౌరసత్వాన్ని అమెరికా తెరపైకి తెచ్చింది. దీంతో అక్కడ జన్మిస్తే ఆటోమేటిక్‌గా వారు ఆ దేశ పౌరులుగా గుర్తించబడతారు. అయితే అమెరికాలో దాదాపు 14 మిలియన్ల జనం చట్టవిరుద్ధంగా నివస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ఆర్డర్స్ జారీ చేశారు.
ఆ ఆదేశాలు నిలిపివేత
ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలు వేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కోర్టు స్పందించింది. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేస్ లా.. జన్మతః పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయీ, ఓరేగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని గురువారం ఫెడరల్ జడ్జి తీర్పు చెప్పారు. అధ్యక్షుడి ఆదేశాన్ని 14 రోజులపాటు నిలిపివేస్తున్నానని ప్రకటించారు. అటు, దీనిపై అప్పీల్‌కు వెళ్తామని ట్రంప్ స్పష్టం చేశారు.





















