Mark Zuckerberg Space Walk: అరుదైన ఘనత సాధించిన Facebook CEO మార్క్ జుకర్ బర్గ్, మెటావర్స్ లో స్పేస్ వాక్
Facebook CEO Zuckerberg Space Walk : మెటావర్స్ ద్వారా స్పేస్ వాక్ చేసిన తొలి మానవులుగా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిసిస్ట్ నీల్ డిగ్రసే టైసన్ నిలిచారు.
Mark Zuckerberg Space Walk : ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అరుదైన ఘనత సాధించారు. మెటావర్స్ ద్వారా స్పేస్ వాక్ చేసిన తొలి మానవులుగా ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిసిస్ట్ నీల్ డిగ్రసే టైసన్ నిలిచారు. అయితే ఇదేదో నిజంగా స్పేస్ లోకి వెళ్లి చేశారని మాత్రం అనుకోకండి. జస్ట్ వాళ్ల వాళ్ల రూమ్స్ లో కూర్చుని జుకర్ బర్గ్, నీల్ ఇద్దరూ అలా సరదాగా స్పేస్ వాక్ చేసి వచ్చారు అంతే.
'మెటావర్స్' టెక్నాలజీ
ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ 'మెటావర్స్' టెక్నాలజీ ని డెవలప్ చేస్తున్న సంగతి మనకందరికీ తెలుసు. అచ్చం మనలానే ఉండే అవతార్స్ క్రియేట్ చేసుకుని... మనిషి బయటి ప్రపంచంలోని చేయలేని పనులెన్నో మెటావర్స్ లో చేయవచ్చు. అలా జుకర్ బర్గ్ కూడా స్పేస్ వాక్ చేయాలన్న తన కోరికను తీర్చుకున్నారు. విద్యార్థుల పాఠ్యాంశాలకు మెటావర్స్ ను జోడించటం ద్వారా పిల్లలకు మరింత అర్థమయ్యేలా విద్యావిధానాన్ని చేరువ చేయాలని జుకర్ బర్గ్ ఓ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు.
(Photo: Star Talk/Youtube)
దాని ట్రయల్స్ లో భాగంగా రీసెంట్‌గా నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటోల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు జుకర్ బర్గ్. ఇందుకోసం ప్రఖ్యాత ఆస్ట్రో ఫిజిస్ట్ నీల్ డిగ్రసే టైసన్ తో కలిసి మెటావర్స్ లో ఓ వీడియోను రూపొందించారు. వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్స్ ద్వారా నాసా జేమ్స్ వెబ్ తీసిన ఫోటోలను త్రీడీలో చూస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు జుకర్ బర్గ్.
జేమ్స్ వెబ్ తీసిన సదరన్ రింగ్ నెబ్యూలా, SMACS 0723, స్టీఫెన్స్ క్వింటెట్, కెరీనా నెబ్యూలా లను మెటావర్స్ లో పరిశీలించారు జుకర్ బర్గ్. ఈ ఫోటోల వివరాలను వాటి ప్రాముఖ్యతను నీల్ టైసన్ ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్‌కు వివరించారు. ఆ తర్వాత నాసా-మెటావర్స్ ప్రాజెక్ట్ లో భాగంగా కల్పించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లారు జుకర్ బర్గ్. అక్కడ ఆస్ట్రోనాట్లు స్పేస్ వాక్ చేస్తూ ఐఎస్ఎస్ కు మరమ్మతులు చేస్తుంటే వాళ్లతో పాటు టైం స్పెండ్ చేశారు. అది కూడా ఊరికినే లేండి. అక్కడ నుంచి భూ భ్రమణాన్ని, రాత్రి పగలు మారుతున్న వైనాన్ని టైసన్, జుకర్ బర్గ్ ఇద్దరూ ఎక్స్ పీరియన్స్ చేశారు. ఈ సందర్భంగా స్పేస్ వాక్ కూడా చేశారు జుకర్ బర్గ్. ఫ్రీ ఫాల్, ఎర్త్ గ్రావిటీ లాంటి టాపిక్స్ పై మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత ఈ వీడియో అసలు ఉద్దేశాన్ని వివరించారు జుకర్ బర్గ్. మెటావర్స్ ద్వారా విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు సాధారణ టెక్ట్ బుక్స్ లో పాఠాలు బోధించటంతో పోలిస్తే ఇలా వర్చువల్ రియాలిటీ ద్వారా మెటావర్స్ సాయంతో వాళ్లు నేర్చుకునే పాఠాలను నేరుగా ఎక్స్ పీరియన్స్ చేస్తే ఎంత థ్రిల్ ఫీల్ అవుతారో... చిన్నారుల్లో నేర్చుకోవాలనే తపనను ఎలా పెంచవచ్చో తమ మెటా టీం వర్క్ పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియోను నీల్ డిగ్రసే టైసన్ తన 'స్టార్ టాక్' ఛానల్ ద్వారా నెటిజన్లకు అందుబాటులో ఉంచారు. సో ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఈ సాంకేతిక అద్భుతాన్ని చూసేయండి.
(Photo: Star Talk/Youtube)