US-China Tariff War: బ్రేకుల్లేని బుల్డోజర్‌లా డ్రాగన్‌పై పడ్డ ట్రంప్- చైనా వస్తువులపై 104 శాతం టారిఫ్
US China Tariff War: చైనాపై భారీగా ప్రతికార సుంకాన్ని అమెరికా విధించింది. డ్రాగన్ చేసే ఎగుమతులపై 104% టారిఫ్ విధిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

US China Tariff War: అమెరికా, చైనా పోటాపోటీగా టారిఫ్‌లు పెంచుకుంటూ పోతున్నాయి. ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ టారిఫ్ యుద్ధానికి తెరతీస్తున్నారు. చైనా విధించిన సుంకానికి ప్రతీకారంగా ఇప్పుడు అమెరికా భారీగా సుంకాలను విధించింది. ఇలా ఇది ఏ తీరానికి చేరుతుందో అని ప్రపంచమంతా టెన్షన్‌తో ఎదురు చూస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాపై టారిఫ్ యుద్ధంలో కొత్త చాప్టర్ ప్రారంభించారు. వైట్ హౌస్ చైనా దిగుమతులపై టారిఫ్‌ను 104 శాతం వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. అమెరికా వస్తువులపై చైనా విధించిన 34 శాతం ప్రతీకార సుంకాలు తొలగించడానికి నిరాకరించడంతో ఈ చర్యకు దిగింది.
చైనాపై 104 శాతం టారిఫ్
వైట్ హౌస్ మంగళవారం ఒక ప్రకటనలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై 104 శాతం అదనపు టారిఫ్‌ను అమలు చేస్తుందని తెలిపింది. ఫాక్స్ బిజినెస్ రిపోర్టర్ ఎడ్వర్డ్ లారెన్స్ ప్రకారం, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చైనా తన ప్రతీకార సుంకాలను తొలగించకపోవడంతో ఏప్రిల్ 9 నుంచి ఈ టారిఫ్‌ను వసూలు చేస్తుందని తెలిపారు.
చైనా ప్రతిస్పందన కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎదురు చూశారు. చైనా వెనక్కి తగ్గకుంటే 100 శాతం కంటే ఎక్కువ టారిఫ్ విధిస్తారని హెచ్చరించారు. అయినా చైనా నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అందుకే అమెరికా ఈ ప్రతీకార చర్యకు దిగింది. ఇకపై జరిగే వాణిజ్య చర్చల్లో చైనాకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదని ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 2న ట్రంప్ మొదటిసారిగా టారిఫ్‌లు ప్రకటించారు. దీంతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి. దీని వల్ల మాంద్యం భయం ఏర్పడింది. వాణిజ్య వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తరువాత మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. అమెరికా స్టాక్స్ భారీగా పెరిగాయి.
చైనా తప్పు చేసింది
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియాతో మాట్లాడుతూ, "చైనా ప్రతీకార చర్యలు తీసుకోవడం ఒక తప్పు. అమెరికాపై ఎవరైనా దాడి చేస్తే, అధ్యక్షుడు ట్రంప్ మరింత బలంగా రియాక్ట్ అవుతారు. కాబట్టి ఈ రాత్రి నుంచి చైనాపై 104 శాతం టారిఫ్ అమలులోకి వస్తుంది." అని అన్నారు. "చైనా చర్చలకు ముందుకు వస్తే, అధ్యక్షుడు ట్రంప్ చాలా ఉదారంగా స్వాగతిస్తారు" అని అన్నారు.
చైనా వెనక్కి తగ్గడం లేదు
ట్రంప్ దాదాపు అన్ని దిగుమతులపై 10 శాతం టారిఫ్‌ను ఇప్పటికే అమలు చేశారు. ఏప్రిల్ 9 నుంచి మరికొన్ని దేశాలపై ఇది 50 శాతం వరకు చేరుకోవచ్చు. కానీ చైనా విషయంలో వైఖరి మరింత కఠినంగా ఉంది. చైనా కూడా తాను వెనక్కి తగ్గనని, దీన్ని "బ్లాక్‌మెయిల్" అని పిలిచినా పట్టించుకోమని చెప్పింది. చైనా ప్రకటనలో, "మేము చివరి వరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము" అని పేర్కొంది. ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి "చైనా కూడా ఒప్పందం చేసుకోవాలనుకుంటుంది. చాలా బలంగా కోరుకుంటుంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలో వారికి అర్థం కావడం లేదు. మేము వారి కాల్ కోసం ఎదురు చూస్తున్నాము. ఇది జరుగుతుంది" అని రాశారు.
ట్రంప్ ప్రభుత్వం ఈ టారిఫ్‌లపై దేశాలతో చర్చలు జరుపుతున్నప్పటికీ, చైనాతో మాత్రం చర్చలకు దూరంగానే ఉంది. ఈ ట్రేడ్ యుద్ధంలో మలుపు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపుతుంది.





















