Nancy Pelosi Taiwan Visit : చైనా ఆర్మీ చేతులు కట్టుకుని కూర్చోదు, నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనపై బీజింగ్ హెచ్చరిక!
Nancy Pelosi Taiwan Visit : యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటనపై చైనా మండిపడింది. చైనా ఆర్మీ చేతులు కట్టుకుని కూర్చోదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
Nancy Pelosi Taiwan Visit : చైనా, అమెరికా మధ్య తైవాన్ వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ సమావేశంలో ఈ అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. తైవాన్ విషయం అగ్రరాజ్యం జోక్యం వద్దని చైనా హెచ్చరిస్తుంది. జో బైడెన్ ముఖంపైనే జింగ్ పింగ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ లో పర్యటిస్తారన్న వార్తలతో చైనా మరింత ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాన్సీ పెలోపి పర్యటిస్తే చైనా ఆర్మీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది.
చైనా తీవ్ర హెచ్చరికలు
తైవాన్ స్థానిక వార్తా సంస్థలు ప్రకారం మంగళవారం రాత్రి తైవాన్ రాజధాని తైపీకి యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి చేరుకోనున్నట్లు సమాచారం. తైవాన్‌లోని సీనియర్ ప్రభుత్వ అధికారి నాన్సీ పర్యటన వివరాలు తెలిపినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. తైవాన్ ప్రభుత్వం మాత్రం నాన్సీ పెలోసి పర్యటనపై బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. ఆసియాలో పర్యటిస్తున్న నాన్సీ పెలోసి తైవాన్ చేరుకుంటే గడచిన 25 ఏళ్లలో ఆ దేశంలో పర్యటించిన మొదటి US హౌస్ స్పీకర్ అవుతారు. తైవాన్ ను చైనా తమ సొంత ప్రావిన్స్‌గా చెబుతోంది. అమెరికా చర్య తమకు ఆమోదయోగ్యం కాదని, రెచ్చగొట్టే చర్యగా చూస్తామని బీజింగ్ స్పష్టం చేసింది. చైనా సోమవారం మరోసారి అమెరికాను హెచ్చరించింది. యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటన జరిగితే తమ సైన్యం చూస్తూ కూర్చొదని చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
చైనా-యూఎస్ సంబంధాలపై ప్రభావం
ఓ US అధికారి CNNతో మాట్లాడుతూ చైనా హెచ్చరికలతో పెంటగాన్ చైనా కదలికలను రౌండ్ ది క్లాక్ పర్యవేక్షిస్తుందన్నారు. చైనాతో తీవ్ర ఉద్రిక్తత ఉన్న సమయంలో పెలోసి తైవాన్ పర్యటన యూఎస్, చైనా రెండింటికీ చాలా ఇబ్బందికరమైన విషయం. అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తర్వాత హౌస్ స్పీకర్ మూడో స్థానంలో ఉంటారు. చైనా ప్రతినిధి జావో లిజియాన్ మాట్లాడుతూ నాన్సీ పెలోసి యూఎస్ ప్రభుత్వ నంబర్ 3 అధికారి నాన్సీ పెలోసి తైవాన్ లో పర్యటిస్తే అది విపరీతమైన రాజకీయ ప్రభావానికి దారి తీస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమైన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) సోమవారం 95వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.
తైవాన్ పర్యటన షెడ్యూల్ లో లేకపోయినా
పెలోసి తైవాన్ పర్యటన ఇంకా ఆమె పబ్లిక్ షెడ్యూల్‌లో లేదు. ఆమె పర్యటన కన్ఫార్మ్ అయితే 1997లో న్యూట్ గింగ్రిచ్ తర్వాత అక్కడికి వెళ్లిన US హౌస్ స్పీకర్‌గా నిలుస్తారు. బీజింగ్ ఈ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. అధికారికంగా పెలోసి ఆసియా పర్యటనలో సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్‌లను మాత్రమే సందర్శిస్తారు. అయితే టెక్సాస్ రిపబ్లికన్, హౌస్ విదేశీ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు మైఖేల్ మెక్‌కాల్, డెమొక్రాట్ అన్నా ఎషూ గత వారం యూఎస్ మీడియాతో మాట్లాడుతూ పెలోసి తమను తైవాన్‌కు ఆహ్వానించినట్లు చెప్పారు. సోమవారం నాన్సీ, ఆరుగురు సభ్యుల కాంగ్రెస్ ప్రతినిధి బృందం సింగపూర్ ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్‌తో చర్చలు జరిపారు. సింగపూర్ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం స్థిరమైన US-చైనా సంబంధాలు ముఖ్యమని సింగపూర్ ఓ ప్రకటనలో తెలిపింది.