Briton Visa Charges Hike: బెంబేలెత్తిస్తున్న బ్రిటన్ వీసా.. భారీగా పెంచేసిన చార్జీలు.. ఎవరెవరికి ఎంతెంత?
వీసాల వ్యవహారానికి సంబంధించి అమెరికా ఇటీవల చార్జీల మోత మోగించింది. ఇక, ఇప్పుడు ఈ దారిలో బ్రిటన్ కూడా పయనిస్తోంది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ చార్జీలను 66శాతం పెంచడంతో రుసుములు భారీగా పెరిగాయి.
Briton Visa Charges Hike: అగ్రరాజ్యం అమెరికా(America) ఇటీవల వీసాల(Visa) చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. వచ్చే మార్చి 6వ తేదీ నుంచి అమెరికా హెచ్-1బీ(H-1B వీసాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అయితే, హెచ్-1బీ వీసాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సహా దరఖాస్తుల ఫీజులను అమెరికా.. అందనంత రేంజ్‌లో పెంచేసింది. గతానికి ఇప్పటికి 100 శాతానికి పైగా ఫీజులు పెంచేశారు. దీంతో ఇప్పుడు హెచ్-1బీ వీసాలు కోరుకునే మధ్య తరగతి ఆశావ హులు అటు వెళ్లాలంటే అప్పులైనా చేయాలి. లేకుంటే ఆశలైనా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక, ఇప్పుడు బ్రిటన్(Briton) వంతు వచ్చింది. ఈ దేశం ప్రస్తుతం ద్రవ్యోల్బణం(Inflation)తో ఇబ్బంది పడుతోంది. దీంతో వీసాల నుంచి పిండేయాలని అనుకుందో ఏమో.. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ చార్జీల(IHS) పేరుతో వీసాల ధరలను అమాంతం పెంచేసింది. అది కూడా ఫిబ్రవరి 6(అంటే.. మంగళవారం) నుంచే అమల్లోకి వచ్చేసినట్టు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ చార్జీలు భారీగా పెరగడం గమనార్హం. ఏకంగా 66 శాతం ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ చార్జీల(IHS)ను పెంచడంతో అన్ని రకాల వీసాలపైనా భారం పడనుంది.
ముందు అమెరికా..
అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆయా సంస్థలు భారత్, చైనాలపై ఎక్కువగా ఆధార పడుతున్నాయి. ఈ దేశాల నుంచే హెచ్-1బీ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎస్‌సీఎస్) ఆన్‌లైన్ చేసేసింది. వీసా కోరుకునే అభ్యర్థులు తొలుత ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఒక ఫీజును నిర్ణయించారు. ఇది .. గతం కన్నా వంద రెట్లు ఎక్కువగా నిర్ణయించారు.
ఇక, ఆ తర్వాత.. వీసా దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. దీనికి కూడా అసాధారణంగా ఫీజులు పెంచేశారు. పైగా.. ఎవరు ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పటికీ ఒకటే దరఖాస్తుగా పరిగణించనున్నారు. మొత్తంగా ఈ ధరల పెంపుదల ఇప్పుడు అభ్యర్థులను తొలి దశలోనే నిలువరించేసేట్టుగా ఉందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఇవీ.. అమెరికా పెంచిన ధరలు..
+ హెచ్-1బీ వీసా: దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది.(38 వేల నుంచి 64700 కు పెంచారు)
+ హెచ్-1బీ రిజిస్ట్రేషన్ రుసుము 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.(800 నుంచి 17,800లకు పెంచారు)
+ ఎల్-1 వీసా దరఖాస్తు రుసుము 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు.(38 వేల నుంచి 1,15000)
+ ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచారు.(3లక్షల 4 వేల నుంచి 9 లక్షలు)
బ్రిటన్ వ్యవహారం ఇదీ..
బ్రిటన్ ప్రధాన మంత్రి(Prime Minister) రుషి సునాక్(Rushi Sunak) ప్రభుత్వం కూడా వీసా(Visa)లపై మోత మొగించింది. ఏకంగా హెల్త్ సర్ చార్జీలను 66 శాతం పెంచేసింది. అది కూడా మంగళవారం(ఫిబ్రవరి 6) నుంచే ఈ పెంపుదల అమల్లోకి వచ్చేసింది. ఈ దేశంలోని ప్రవేశించాలన్నా.. ఉండాలన్నా.. కూడా ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ చార్జీ(IHS)ని ఖచ్చితం చేయడం గమనార్హం. గత డిసెంబరులోనే దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతేకాదు, జనవరి 16 నుంచే అమలు చేయాలని భావించారు. కానీ, పార్లమెంటు సమావేశాల్లో ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు సమయం పట్టింది. దీంతో కొంత ఆలస్యమైంది. అయితే.. జనవరి 6వ తేదీ నాటికి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చారు.
భారం ఇలా..
+ ఒక్కొక్క వీసాపైనా రమారమి 624 పౌండ్ల నుంచి 1035 పౌండ్లు పెరగనున్నాయి. భారతీయ కరెన్సీలో ఇది.. 65 వేల నుంచి 1,0,8000 వరకు భారం పెరగనుంది.
+ 18 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులను కూడా వదల్లేదు. వారికి కూడా.. సర్ చార్జీని 470పౌండ్ల నుంచి 776 పౌండ్లకు పెంచారు. అంటే.. 49 వేల నుంచి 80,900 వరకు పెంచారు.
+ పర్యాటక, విద్యార్థి, సందర్శన(విజిట్) వీసాల చార్జీలను పెంచారు. ప్రస్తుతం ఉన్న వీసాలపై 15 పౌండ్లు(ఇండియన్ కరెన్సీలో 1565 రూపాయలు, విద్యార్థి వీసాలను 127 పౌండ్లు, అంటే.. 13,250 రూపాయలు పెంచారు. దీంతో ఒక్కొక్క వ్యక్తిపై మరింత భారం పడనుంది.
+ స్కిల్డ్ వర్క్ వీసా రుసుము 47 శాతం పెంచినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో వీరిపై మరింత భారం పడనుంది. ప్రస్తుతం 29 వేల పౌండ్లు గా ఉన్న ఈ వీసా.. ఇప్పుడు 38,700 పౌండ్లకు చేరింది.
సర్ చార్జీలు ఎంతెంతంటే!
+ పెద్దలు ఒక్కరికి మూడేళ్లకు 3015 పౌండ్లు, ఐదేళ్లకు 5175 పౌండ్లు చెల్లించాలి
+ పెద్దలు ఇద్దరికి మూడేళ్లకు 6210 పౌండ్లు, ఐదేళ్లకు 10350 పౌండ్లు చెల్లించాలి
+ పిల్లలు ఒక్కరికి మూడేళ్లకు 2328 పౌండ్లు, ఐదేళ్లకు 3880 పౌండ్లు చెల్లించాలి
+ ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారికి మూడేళ్లకు 8538 పౌండ్లు, ఐదేళ్లకు 14,230 పౌండ్లు చెల్లించాలి
+ ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలకు మూడేళ్లకు 10,866 పౌండ్లు, ఐదేళ్లకు 18,110 పౌండ్లు చెల్లించాలి