F 35 jet: రిపేర్ కాని ఫైటర్ జెట్ - రన్ వే నుంచి హ్యాంగర్‌కు తరలించేందుకు ఎట్టకేలకు బ్రిటన్ అంగీకారం !
Kerala: తిరువనంతపురం ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటిష్ జెట్.. ను ఎట్టకేలకు హ్యాంగర్ కు తరలిస్తున్నారు. రిపేర్ చేయడం ఎవరి వల్లా కావడం లేదు.

British F 35 jet stranded in Kerala will be moved to hangar : బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన అత్యాధునిక F-35B స్టెల్త్ ఫైటర్ జెట్, జూన్ 14, 2025న కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. అప్పటి నుంచి అక్కడే ఉంది. దాన్ని రిపేర్ చేయలేకపోతున్నారు. హ్యాంగర్ కు తరలించే ఆఫర్ ఇచ్చినా .. బ్రిటన్ అంగీకరించలేదు. చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రిపేర్ కాకపోవడంతో.. హ్యాంగర్ కు తరలించేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటి వరకూ ఫైటర్ జెట్ రహస్యాలు తెలుసుకుంటారని బహిరంగంగానే ఉంచింది. ఈ జెట్ విలువ రూ. 900 కోట్లు ఉంటుంది. విదేశీ భూమిపై నిలిచిపోయిన మొదటి బ్రిటిష్ F-35B ఇదే.
ఈ F-35B జెట్, HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విమాన వాహక నౌక నుండి భారత సముద్రంలో భారత నౌకాదళంతో జరిగిన ఉమ్మడి సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకు వచ్చింది. కేరళ తీరం నుండి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న నౌకపై ల్యాండ్ చేయడానికి చేసిన ప్రయత్నం విఫలమయింది. తిరువనంతపురం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. జెట్ సురక్షితంగా ల్యాండ్ చేసినప్పటికీ, హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా అది మళ్లీ టేకాఫ్ కాలేకపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి వచ్చిన బ్రిటిష్ నావికాదళ ఇంజనీర్ల బృందం ప్రయత్నించినప్పటికీ రిపేర్ కాలేదు.
జెట్ విమానాశ్రయంలోని బే నంబర్ 4లో రెండు వారాల నుంచి అలాగే ఉండిపోయింది. ఎండ, వానలకు అలాగే ఉంచేశారు. సంరక్షించేందుకు భారత్ ప్రభుత్వం హ్యాంగర్ ఆఫర్ చేసింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా భద్రత కల్పించారు. కానీ ఆ యుద్ధ నౌక రహస్యాలు తెలుసుకుంటారన్న అనుమానంతో బ్రిటన్ బయటే ఉంచింది. HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి వచ్చిన ఇంజనీర్ల బృందం సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది, కానీ విజయవంతం కాలేదు.
భారత వైమానిక దళం (IAF) , ఎయిర్ ఇండియా జెట్‌ను విమానాశ్రయంలోని మెయింటెనెన్స్, రిపేర్, అండ్ ఓవర్‌హాల్ (MRO) హ్యాంగర్‌కు తరలించేందుకు అంగీకారం తెలిపాయి. బ్రిటిష్ నావికాదళం మొదట ఈ ప్రతిపాదనను తిరస్కరించింది, ఎందుకంటే F-35B యొక్క స్టెల్త్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీలు సున్నితమైనవి . వాటిని రహస్యంగా ఉంచాలని కోరుకున్నారు. అయితే సమస్య ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో యుకె ఇంజనీరింగ్ బృందాలు , ప్రత్యేక సామగ్రి రాకతో జెట్‌ను MRO హ్యాంగర్‌కు తరలించడానికి అంగీకరించినట్లు తెలిపింది. ఈ విమానం వల్ల విమానాశ్రయ సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు విమానాశ్రయ సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉంటుంది.
హ్యాంగర్‌లో మరమ్మత్తులు విజయవంతం కాకపోతే, జెట్‌ను C-17 గ్లోబ్‌మాస్టర్ లేదా ఇతర హెవీ-లిఫ్ట్ విమానం ద్వారా యుకెకు తిరిగి తీసుకెళ్లే అవకాశం ఉంది.





















