Baltimore Bridge Collapse: అమెరికాలో ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జి, ఓడ ఢీకొనడంతో విషాదం
Francis Scott Key Bridge collapse: అమెరికాలోని మేరీల్యాండ్ లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలింది.
Baltimore Bridge Collapses In US As Cargo Ship Hits Pillar: అమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఓ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని మంగళవారం నాడు ఓ ఓడ ఢీకొనడంతో సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై వెళ్తున్న కొన్ని వాహనాలు నీళ్లల్లో పడిపోయాయని సమాచారం. పటాప్స్కో నదిపై నిర్మించిన ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయిందని మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (MTA) అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జి కుప్పకూలుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఫ్రాన్సిస్ స్కాట్ బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కిందనుంచి ప్రయాణిస్తున్న ఒక భారీ నౌక నౌక వంతెన పిల్లర్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వంతెన మీద ప్రయాణిస్తున్న వాహనాలు, దానిపై నడుస్తున్న కొందరు పాదచారులు నీళ్లల్లో పడిపోయారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రమాదం మేరీల్యాండ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 7 వాహనాలు నీళ్లల్లో పడిపోయి ఉంటాయని బాల్టీమోర్ సిటీ అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్యపై అధికారులు ఇంకా ప్రకటన చేయలేదు.
Breaking - A cargo ship has hit the Francis Scott Key bridge in Baltimore. It caught fire before sinking and causing multiple vehicles to fall into the water below.
— Sarah Fields (@SarahisCensored) March 26, 2024
pic.twitter.com/v24fuckDSC
బ్రిడ్జి కుప్పకూలిన 10 నిమిషాల తర్వాత సాయం కోసం ఓ పడవ అక్కడికి చేరుకుంది. మొత్తం 10 పడవలు, గజ ఈతగాళ్ల సాయంతో నీళ్లల్లో పడిపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కూలిపోవడంతో ఇటు వైపు ఉన్న అన్ని రోడ్డు మార్గాలలో వచ్చే వాహనాలను వైరే మార్గం వైపు తరలిస్తున్నారు. బాల్టిమోర్ బ్రిడ్జి కూలడంతో సామాన్య ప్రజలతో పాటు వ్యాపార పరంగా సమస్యలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు.
ఈ వంతెనను దాదాపు 47 ఏళ్ల కిందట నిర్మించారు. మేరీల్యాండ్ స్టేట్ పోలీసులు హెలికాప్టర్ లో బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాల్టిమోర్ మేయర్ బ్రాండన్ ఎమ్ స్కాట్ ఘటనపై స్పందించారు. బ్రిడ్జి కూలిన సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరో అధికారి ఎంవీ డాలీ మాట్లాడుతూ.. బ్రిడ్జి పిల్లర్ ను ఢీకొట్టిన ఓడను 2015లో రూపొందించారని వెల్లడించారు. భారీ ఓడ వంతెన పిల్లర్లను ఢీకొట్టడంతో కూలిపోయిందన్నారు.