Free Rail Travel: ఒక్క టాటూ వేయించుకుంటే చాలు, ఏడాదంతా ఆ దేశాన్ని ఫ్రీగా చుట్టేయొచ్చు
Free Rail Travel: ఆస్ట్రియా అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఏడాదంతా ఫ్రీగా దేశాన్నిచుట్టే ఆఫర్ ఇచ్చింది.
Free Rail Travel: ట్రావెలింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొత్త కొత్త ప్రాంతాలను చుట్టేయాలని కోరుకుంటారు. సమయం, సందర్భం దొరికితే చాలు ఎక్కడికైనా వెళ్లిపోతుంటారు. కొందరు తమ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని కోరుకుంటారు. మరికొందరేమో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటారు. ఇంకొందరు వివిధ దేశాలకు వెళ్లి టూరిస్ట్ స్పాట్ లను చూడాలని ఆశ పడతారు. అయితే ట్రావెలింగ్ కు వెళ్లే చాలా మందిని వేధించే సమస్యలు రెండు ఉంటాయి. ఒకటి సమయం అయితే, మరొకటి డబ్బు. డబ్బున్న వారికి సమయం దొరకదు, సమయం ఉన్న వారికి డబ్బు ఉండదు. అలా ట్రావెలింగ్ కు వెళ్లలేకపోతుంటారు.
ట్రావెలింగ్ చేయాలనుకుని డబ్బు లేని వారికి ఆస్ట్రియా దేశ ప్రభుత్వం ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ తో ఏడాదంతా ఆస్ట్రియాలో ఫ్రీగా తిరగొచ్చు. రైలు జర్నీలో దేశం మొత్తం చుట్టేసి రావొచ్చు. అయితే ఈ ఆఫర్ ను అందుకోవాలంటే మాత్రం ఒక చిన్న కండీషన్ ఉంది. ఒంటిపై ఓ చిన్న టాటూ వేయించుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
క్లైమాటికెట్ లేదా క్లైమేట్ టికెట్ గా పిలుస్తున్నారు. రైల్‌కార్డును ఒంటిపై టాటూ వేయించుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ క్లైమాటికెట్ ధర సాధారణంగా రూ. 89 వేల వరకు ఉంటుంది. ఈ ఆఫర్ ను ఆస్ట్రియా వాతావరణ శాఖ మంత్రి లియోనోర్ గెవెస్లర్ ప్రకటించారు. ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న మంత్రి ఈ ఆఫర్ ను ప్రకటించారు. ఆ తర్వాత ఆ మంత్రి తన చేతిలో వేసుకున్న రైల్‌కార్డ్ టాటూ ఫోటోను షేర్ చేశారు.
ఆ మ్యూజిక్ ఫెస్టివల్ లో ఉన్న టాటూ సెంటర్ లో ఉచిత మొదట వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు టాటూలు వేసి రైల్‌కార్డ్స్ అందించారు. అలాంటి టాటూ సెంటర్ లు ఆ తర్వాత పలు ఈవెంట్లలోనూ దర్శనమిచ్చాయని స్థానికులు తెలిపారు. రైల్‌కార్డ్ ప్రమోషన్లకు మంచి స్పందనే వస్తున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. తాజాగా మరో ఆరుగురు వ్యక్తులు టాటూ వేయించుకుని ఆ ఫ్రీ రైల్ ట్రావెల్ ఆఫర్ ను అందుకున్నారు. గత నెల రోజుల్లో 30 మంది తమ ఒంటిపై టాటూ వేయించుకుని ఈ ఫ్రీ రైల్ ఆఫర్ ను పొందారు.
అయితే ఈ తరహా ప్రచారంపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ మంత్రి గెవెస్లర్ ఈ ప్రచారం కార్యక్రమంపై వెనక్కి తగ్గడం లేదు. ఈ టాటూలను 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఈ రైల్ కార్డ్ టాటూలు వేయించుకుంటున్న వారిలో చాలా మందికి అప్పటికే పలు రకాల టాటూలు ఉంటున్నట్లు గుర్తించామన్నారు. ప్రతిపక్ష నియోస్ పార్టీకి చెందిన ఎంపీ హెన్రిక్ ఈ టాటూ ప్రచారంపై మండిపడ్డారు. జనాలకు డబ్బు ఆశ చూపి, ప్రచార కార్యక్రమంలో భాగంగా చర్మంపై టాటూలు వేయించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు.
క్లైమాటికెట్ ను ఆపరేట్ చేస్తున్న వన్ మొబిలిటీ సంస్థ డైరెక్టర్ జేక్ లాంబార్ట్ స్పందిస్తూ.. ఈ టాటూ ప్రచార కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని, జనాల నుంచి సానుకూల ఫీడ్‌బ్యాక్ వస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2021 లో తొలిసారిగా ఈ క్లైమాటికెట్ ను తీసుకువచ్చారు. ఆస్ట్రియాలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు పై అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ మంది ప్రజలను పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాడేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ క్లిమాటికెట్ ను తీసుకువచ్చారు.
View this post on Instagram