Afghanistan Taliban News: అఫ్గాన్ ప్రస్తుత పరిస్థితిపై భారత వైఖరేంటి? విదేశాంగ మంత్రి ఎమన్నారంటే..
ఆఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఐరాస భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో చర్చించడానికి ప్రస్తుతం జయశంకర్ న్యూయార్క్ వెళ్లారు.
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు దురాక్రమించుకోవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్ ఏ వైఖరి అవలంబిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పందించారు. ఆఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఐరాస భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో చర్చించడానికి ప్రస్తుతం జయశంకర్ న్యూయార్క్ వెళ్లారు. న్యూయార్క్‌లో మంత్రి జయశంకర్ బుధవారం (ఆగస్టు 18) విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం అఫ్గాన్‌లో చిక్కుకొని ఇబ్బందుల్లో ఉన్న భారతీయులను వెనక్కు తీసుకురావడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని జయశంకర్ అన్నారు. ప్రస్తుతానికి అందరిలాగే తాము కూడా అఫ్గాన్‌లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని మంత్రి జయశంకర్ అన్నారు.
తాలిబన్లతో భారత్ ఇటీవల ఏవైనా చర్చలు జరిపిందా అని ఓ అమెరికన్ విలేకరి అడగ్గా ఆ ప్రశ్నపై మంత్రి స్పందిస్తూ.. కాబూల్‌లో ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తున్నామని, ఇప్పటికే తాలిబన్లు, వాళ్ల ప్రతిధులు కాబూల్‌కు వచ్చారని అన్నారు. అంతేకాక, ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం కూడా అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కు తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. అఫ్గాన్‌లో భారత్ పెట్టుబడులు యథాతథంగా కొనసాగిస్తారా? అని మరో విలేకరి అడగ్గా.. మంత్రి స్పందిస్తూ.. అఫ్గాన్ ప్రజలతో భారత చారిత్రక సంత్సంబంధాలు అలాగే కొనసాగుతాయని మంత్రి వెల్లడించారు.
‘‘ఇలాంటి పరిస్థితుల్లో అన్ని దేశాల తరహాలోనే అఫ్గాన్‌లోని పరిస్థితులను, పరిణామాలను మేం క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి మా ఫోకస్ అంతా అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించడంపైనే ఉంది.’’ అని విదేశాంగమంత్రి జయశంకర్ అన్నారు.
అఫ్గానిస్థాన్‌తో భారత్‌కు తొలి నుంచి మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఓ మిత్ర దేశంగా ఆ దేశ అభివృద్ధి కోసం గత 20 సంవత్సరాల్లో భారత్ భారీ ఎత్తున అక్కడ పెట్టుబడులు పెట్టింది. ఆ దేశ పార్లమెంటు భవనం సహా ఓ రిజర్వాయర్‌ను కూడా నిర్మించింది. కానీ ఇప్పుడా దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అఫ్గానిస్థాన్-భారత్ సంబంధాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: Afghanistan Taliban Crisis: ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్ల కసరత్తు.. మాజీ అధ్యక్షుడితో భేటీ