Afghanistan: అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకం.. ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత!
అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు చంపేసినట్లు తెలుస్తోంది. పంజ్‌షేర్‌లో రోహుల్లాను గుర్తించిన తాలిబన్లు.. ఆయన ఇంట్లోకి చొరబడి, కాల్చి చంపినట్లు సమాచారం.
అఫ్గానిస్తాన్ దేశంలో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. దేశాన్ని ఆక్రమించిన నాటి నుంచి తాలిబన్లు అక్కడి ప్రజలపై దాడులతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల పంజ్‌షేర్ ప్రాంతాన్ని ఆక్రమించిన తాలిబన్లు.. అక్కడ కూడా నరమేధం సృష్టిస్తున్నట్లు సమాచారం అందుతోంది. పంజ్‌షేర్‌ను నియంత్రణలోకి తెచ్చుకున్నాక అక్కడ విధ్వంస కాండ సృష్టిస్తున్నారు. అక్కడ ఇంటింటి తనిఖీలు చేపడుతూ.. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారితో పాటు మైనారిటీలను హతమార్చుతున్నట్లు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు చంపేసినట్లు తెలుస్తోంది. అఫ్గన్ దేశంలో ఉద్రిక్తతల కారణంగా రోహుల్లా కాబూల్‌ను విడిచి పంజ్‌షేర్‌కు వెళ్లినట్లు సమాచారం.
గత నెల 15న తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణ తర్వాత రెసిస్టెన్స్ ఫోర్సెస్ నాయకుడు అహ్మద్ మసూద్‌తో కలిసి అమ్రుల్లా సలేహ్ పంజ్‌షేర్‌కు వెళ్లారు. అనంతరం ఆయన తనకు తానుగా అఫ్గాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ప్రస్తుతం పంజ్‌షేర్‌లో ఉన్న రోహుల్లాను గుర్తించిన తాలిబన్లు.. ఆయన ఇంట్లోకి చొరబడి, అతి కిరాతకంగా కాల్చి చంపినట్లు కథనాలు పేర్కొన్నాయి.
నరమేధానికి తెగబడుతున్న తాలిబన్లు..
పంజ్‌షేర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో తాలిబన్లు, రెసిస్టెన్స్ ఫోర్సెస్‌కు మధ్య భీకరమైన పోరు సాగుతోంది. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. తాలిబన్ల బారిన పడకుండా పంజ్‌షేర్ ప్రజలు చాలా కాలం పోరాడారు. తమకు సాయం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. అయినా ఫలితం దక్కలేదు. నాలుగు రోజుల కిందట పంజ్‌షేర్ వ్యాలీని సైతం తమ అదుపులోకి తెచ్చుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అక్కడితో ఆగని తాలిబన్లు.. వారికి వ్యతిరేకంగా ఉన్న యువకులను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఈ నరమేధానికి భయపడి ఇప్పటికే వంద మందికి పైగా కుటుంబాలు పారిపోయినట్లు రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రజలు అంటున్నారు.
తాలిబన్లు అఫ్గాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. తొలుత మహిళలకు తామెలాంటి హాని కల్పించమని ప్రగల్భాలు పలికిన తాలిబన్లు.. కొద్ది రోజుల్లోనే తమ అసలు రూపాన్ని బయటపెట్టడం మొదలుపెట్టారు. వివాదాస్పద షరియా చట్టం అమలుతో మహిళల స్వేచ్ఛకి సంకెళ్లు వేశారు. దీంతో అక్కడ నివసిస్తున్న మహిళలు, బాలికల జీవితం నరకప్రాయంగా మారింది. దీంతో పాటు పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఇకపై అక్కడి కాలేజీల్లో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోరాదని ఆదేశించారు.
Also Read: Afghanistan Taliban Crisis: 'అఫ్గాన్- లగాన్'కి లింకేంటి.. తాలిబన్లపై భారత్ 'స్టాండ్' ఏంటి?