UK Woman Got RS 2 Crore: ఉద్యోగికి ఓ గంట పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు.. సీన్ కట్ చేస్తే రూ.2 కోట్లకు బ్యాండ్..
ఓ మహిళకు పనివేళల్లో వెసులుబాటు కల్పించని కంపెనీకి కోర్టు షాక్ ఇచ్చింది. దాదాపు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఉద్యోగ వేళల్లో చిన్న వెసులుబాటు అడిగితే ఒప్పుకోలేదని జాబ్ కే రిజైన్ చేసింది ఆ మహిళ. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో ప్రశ్నించింది. ఆమె వాదనలు విన్న కోర్టు ఏకంగా ఆమెకు రూ.2 కోట్లు పరిహారం ఇప్పించింది. షాకయ్యారా? అవును. ఇంగ్లాండ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
అసలేం జరిగింది?
అలైస్ థామ్సన్ అనే మహిళ ఓ సంస్థలో ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు. అయితే తన కూతుర్ని రోజూ నర్సరీ నుంచి ఇంటికి తీసుకువెళ్లటానికి ఓ గంట వెసులుబాటు కల్పించాలని ఆమె తన బాస్ ను కోరారు. రోజూ సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాల్సి ఉండగా 5 గంటలకు వెళ్లేలా అనుమతి కోరారు థామ్సన్. దీంతో పాటు వారంలో నాలుగు రోజులే పనిచేసేలా పర్మిషన్ అడిగారు. ఇందుకు ఆమె బాస్ ఒప్పుకోలేదు. అయితే తన పాపను చూసుకోవడానికి అవడం లేదని ఆమె ఉద్యోగానికే రాజీనామా చేశారు.
న్యాయ పోరాటం..
కానీ మహిళను కావడం వల్లే తనపై వివక్ష చూపుతున్నారని బాధ పడ్డారు థామ్సన్. మెటర్నిటీ లీవ్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే ఉద్యాగానికి వచ్చినప్పటికీ తనకు వెసులుబాటు ఇవ్వలేదని దీని వల్లే రిజైన్ చేయాల్సి వచ్చిందని ఆమె కోర్టును ఆశ్రయించారు. తాను 2016లో మేనర్స్ అనే కంపెనీలో ఉద్యోగిగా చేరానని, ఆ సమయంలో ఏడాదికి తన జీతం 120,000 యూరోలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. తాను కంపెనీ కోసం ఎంతో కష్టపడ్డానని, సేల్స్ మేనేజర్ స్థాయికి వచ్చినట్లు తెలిపారు.
వాదనలు విన్న కోర్టు.. కంపెనీ ఆమెకు వెసులుబాటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టింది. ఇన్నాళ్లూ తాను కోల్పోయిన ఆదాయం సహా ఆమె పొందిన ఆవేదనకు 184,961.32 యూరోలు (దాదాపు రూ.2 కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చింది.