Jupiter Closest To Earth: నేడు అంతరిక్షంలో అద్భుతం, 59 ఏళ్ల తర్వాత భూమికి అతి దగ్గరగా గురు గ్రహం
Jupiter Closest To Earth: 1963లో చివరిసారిగా భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత జూపిటర్ ఇంత దగ్గరగా రావటం ఇదే. ఫలితంగా జూపిటర్ పైనున్న గ్రేట్ రెడ్ స్పాట్ ను చాలా క్లియర్ గా చూసే అవకాశం లభించనుంది.
అంతరిక్షంలో సెప్టెంబర్ 26 న అద్భుతం
భూమికి అతిదగ్గరగా రానున్న బృహస్పతి
గ్రేట్ రెడ్ స్పాట్ ను దగ్గరగా చూసే అవకాశం
స్పష్టంగా కనిపించనున్న నాలుగు చందమామలు
సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండటంతో స్పష్టత
అరవై ఏళ్ల తర్వాత ఇంత దగ్గరగా జ్యూపిటర్
బృహస్పతిపై పరిశోధనలకు మంచి సందర్భం
Jupiter Closest To Earth: అంతరిక్షంలో అద్భుతం జరగనుంది. సెప్టెంబర్ 26 వ తేదీన భూమికి అతి దగ్గరగా మన సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహం గురు గ్రహం రానుంది. ఇలాంటి అద్భుతం జరిగి సరిగ్గా 59 ఏళ్లయింది. 1963లో చివరిసారిగా భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత జూపిటర్ ఇంత దగ్గరగా రావటం ఇదే. ఫలితంగా జూపిటర్ పైనున్న గ్రేట్ రెడ్ స్పాట్ ను చాలా క్లియర్ గా చూసే అవకాశం లభించనుంది.
ఎందుకు వస్తోంది :
సౌర కుటుంబంలోని ప్రతీ గ్రహం తన కక్ష్యలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగే క్రమంలో ప్రతీ గ్రహం కూడా మరో గ్రహానికి అతి దగ్గరగా రావటం, అత్యంత దూరంగా వెళ్లటం కూడా జరుగుతుంది. కానీ ఈ సారి గురు గ్రహం రావటం ఎందుకు అంత స్పెషల్ అంటే.. .సూర్యుడికి వ్యతిరేక దిశలో బృహస్పతి మన భూమి దగ్గరకు వస్తోంది. అంటే సూర్యుడి తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు కదా. సూర్యుడు పడమరన అస్తమించే సమయంలో బృహస్పతి గ్రహం భూమికి తూర్పున ఉదయిస్తుందన్నమాట. సో సూర్యుడి కి పూర్తి వ్యతిరేక దిశలో ఉండటం వల్ల బృహస్పతిని భూమి మీద నుంచి చాలా క్లియర్ గా చూడగలుగుతాం.
సూర్యుడికి వ్యతిరేక దిశలో బృహస్పతి రావటం ప్రతీ పదమూడు నెలలకు ఓ సారి జరుగుతుంది కానీ.. భూమికి అతి దగ్గరగా ఉన్నప్పుడు ఇలా వ్యతిరేక దిశలో రావటం అనేది 59 ఏళ్ల తర్వాత ఇదే. సాధారణంగా భూమికి, బృహస్పతికి మధ్య దూరం 600 మిలియన్ మైళ్లు. ఇప్పుడు సెప్టెంబర్ 26 న భూమికి, బృహస్పతికి మధ్య దూరం 367 మిలియన్ మైళ్లు ఉంటుంది. అంటే దాదాపు రెండు రెట్లు పెద్దగా కనిపిస్తాడు బృహస్పతి (గురు గ్రహం).
గురు గ్రహంను మనం ఎలా చూడాలి ?
సెప్టెంబర్ 26న సాయంత్రం సమయం నుంచి బృహస్పతిని చూడొచ్చు. అయితే ఇందుకోసం ఓ మంచి బైనాక్యులర్స్ కానీ, టెలిస్కోప్ కానీ ఉంటే మరింత క్లియర్ గా చూడొచ్చు. పైగా గురు గ్రహం మీద గ్రేట్ రెడ్ స్పాట్ ను స్పేస్ టెలిస్కోప్ ఉంటే క్లియర్ గా చూసే అవకాశం ఉంటుంది. ఇంతకీ గ్రేట్ రెడ్ స్పాట్ అంటే తెలుసుగా. అది జూపిటర్ మీద ఉన్న అతి పెద్ద తుపాను. సుమారుగా 357 ఏళ్లుగా ఆ తుపాను అలా జూపిటర్ మీద ఆ ప్రాంతంలో స్థిరంగా ఉంది. గంటకు 432 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే ఎంత పెద్ద తుపాను ఉన్నట్లు అంత పెద్దదన్న మాట. సౌరకుటుంబంలో ఇప్పటివరకూ అన్ని గ్రహాల మీద చేసిన అబ్జర్వేషన్స్ లో ఇదే అతి పెద్ద తుపాను గా కనుగొన్నారు శాస్త్రవేత్తలు. సో ఈ సారి ఆ తుపాను కలిగించిన గ్రేట్ రెడ్ స్పాట్ ను కూడా చూడొచ్చన్న మాట.
🛰 Juno will fly by Europa on Thursday, Sept. 29, at 5:36am ET (09:36 UTC), taking some of the highest resolution images of the Jupiter moon ever, and collecting valuable data for the upcoming @EuropaClipper mission: https://t.co/t2aGuziswu pic.twitter.com/UCZ8shUN2F
— NASA (@NASA) September 24, 2022
బృహస్పతి, చందమామల కనువిందు :
అతిపెద్ద గ్రహం గురుడుకు మొత్తం 79 చందమామలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటిలో 53 చందమామలకు పేర్లు కూడా పెట్టారు. కానీ వీటన్నింటిలో అతి పెద్ద చందమామలు నాలుగు. వాటి పేర్లు లో, యూరోపా, గైనమేడ్, కెలిస్టో. ఈ నాలుగు పెద్ద చందమామలను గెలీలియన్ శాటిలైట్స్ అంటారు. 1610 లో ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలీలీయో గలేలి మొదటి సారిగా వీటిని గుర్తించారు. అందుకే వాటిని గెలీలియన్ శాటిలైట్స్ అంటారు. వీటిని మనం కూడా అతి దగ్గరగా చూడొచ్చు. బైనాక్సులర్స్ తో చూస్తే వెలుగు చుక్కల్లా కనిపిస్తాయి. అదే స్పేస్ టెలిస్కోప్ తో ఇంకా బాగా కనిపిస్తాయి.
Stargazers: Jupiter will make its closest approach to Earth in 59 years! Weather-permitting, expect excellent views on Sept. 26. A good pair of binoculars should be enough to catch some details; you’ll need a large telescope to see the Great Red Spot. https://t.co/qD5OiZX6ld pic.twitter.com/AMFYmC9NET
— NASA (@NASA) September 23, 2022
చెలరేగిపోనున్న జూనో :
నాసా జూనో అనే స్పేస్ క్రాఫ్ట్ ను 2011 లో ప్రయోగించింది. ఐదేళ్ల తర్వాత ఇది జూపిటర్ కక్ష్యలోకి చేరుకుంది. దీని పని ఏంటంటే సౌరకుటుంబంలోనే అతి పెద్ద గ్రహం బృహస్పతి చుట్టూ తిరుగుతూ.. దాన్ని దాని చందమామలను మంచిగా ఫొటోలు తీయటం. ఇప్పటికే ఎన్నో ఫొటోలు తీసింది. 2025 వరకూ ఇది పనిచేస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పుడు జూపిటర్ సూర్యుడికి వ్యతిరేక దిశలోకి వస్తుంది కాబట్టి... బృహస్పతి చందమామ యూరోపాను జూనో తో దగ్గరగా ఫొటోలు తీయించాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యూరోపా అనే చందమామ మొత్తం ఐస్ తో నిండిపోయి ఉంది. ఆ ఐస్ కింద భారీ సముద్రం ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు జూనో తీసే ఫోటోలతో పాటు భవిష్యత్తులో నాసా ప్రయోగించాలనుకుంటున్న యూరోపా క్లిఫర్ కూడా ఈ యూరోపాపై ప్రయోగాలు చేయనుంది.
మీరు కూడా దగ్గర్లో ఉన్న ఏదైనా సైన్స్ సెంటర్ కు మీ పిల్లలను తీసుకెళ్తే అక్కడ స్పేస్ టెలిస్కోప్ నుంచి గురు గ్రహంను దాని చందమామలను చూపించొచ్చు. లేదా బైనాక్యులర్స్ తో అయినా చూడొచ్చు. మళ్లీ ఇలాంటి అవకాశం రావాలంటే ఇంకో అరవై ఏళ్లు వెయిట్ చేయాలన్న సంగతి మాత్రం మర్చిపోకండి.