Ants Unity: చీమలు ఒకే లైన్‌లో ఎందుకు నడుస్తాయి? అవి అంత యునిటీగా ఉండటానికి రీజన్ ఏంటి?
Ants Unity: చీమలు యునిటీగా ఉండటానికి ఎన్నో సైంటిఫిక్ కారణాలున్నాయి.
Why do Ants Walk in a Line?
"చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి" అని అందరూ చెబుతుంటారు. ఎందుకిలా అంటారు అనే ప్రశ్నకు అందరికీ సమాధానం తెలుసు. అవి క్రమ పద్ధతిలో ఒకే వరుసలో నడుస్తాయి. పొరపాటున కూడా దారి తప్పవు. గమ్యస్థానం చేరుకునేంత వరకూ చాలా పద్ధతిగా వెళ్తాయి. మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చినా...అటు ఇటూ వెళ్లి మళ్లీ చివరకు ఒకే వరుసలోకి వచ్చేస్తాయి. ఆహారం సేకరించే సమయంలోనూ అవి చాలా యునిటీగా ఉంటాయి. తమకు కావాల్సింది ఏదైనా...సాధించుకునేంత వరకూ అవి ఆ యునిటీని వదలవు. ఈ డిసిప్లేన్ వాళ్లకు ఎలా వచ్చింది..? అవి అలా ఒక్కటిగా ఉండటం వెనక మిస్టరీ ఏంటి..? ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
లైన్‌లోనే ఎందుకు వెళ్తాయి..?
చీమలు (Ants) ఒకే వరుసలో వెళ్లటం మనం చాలా సార్లు చూసే ఉంటాం. దీనికి ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. చీమలు నిత్యం Pheromones అనే కెమికల్ సెంట్‌ను తమ శరీరం నుంచి స్రవిస్తుంటాయి. చీమలు ఒకరితో ఒకటి ఇలా ఫెరోమోన్స్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి. ఈ కెమికల్ ద్వారానే వెనకాల వచ్చే చీమలకు వార్నింగ్ ఇస్తుంటాయి. దగ్గర్లో శత్రువు ఉంటే అప్రమత్తం చేయాలన్నా, లేదంటే...ఆహారం దొరికే స్థలాన్ని కనుక్కోటానికైనా ఈ కెమికల్‌తోనే సిగ్నల్స్ ఇచ్చేస్తాయన్నమాట. చీమలు నివసించే చోటుని ఓ కాలనీ అనుకుందాం. ఆ కాలనీ నుంచి కొన్ని చీమలు మాత్రమే ఆహార అన్వేషణకు బయల్దేరతాయి. ఓసారి ఫుడ్ సోర్స్‌ని కనుక్కోగానే...అక్కడి నుంచి మళ్లీ తమ కాలనీకి తిరుగు పయన మవుతాయి. ఈ వచ్చే క్రమంలో ఆ దారంతా ఫెరోమోన్స్‌ను విడుదల చేస్తాయి. నేరుగా తమ చోటుకి వెళ్లి మిగతా చీమలతో కమ్యూనికేట్ చేస్తాయి. అవి మళ్లీ కలిసి కట్టుగా ఫెరోమోన్స్ విడుదల చేసిన దారిలోనే ఫుడ్ సోర్స్ వద్దకు వెళ్తాయి. ఆహారం దొరికేంత వరకూ ఇలా అన్ని చీమలూ ఆ కెమికల్‌ను రిలీజ్ చేస్తూనే ఉంటాయి. వెనకాల వచ్చే చీమలు ఆ కెమికల్‌ను సెన్స్ చేస్తూ వచ్చేస్తాయి. ఆహారం అంతా ఆరగించాక మళ్లీ అవే ఫెరోమోన్స్ సాయంతో తమ సొంత చోటుకు వచ్చేస్తాయి.
(Image Credits: Pixabay)
ఎన్నో విధాలుగా కమ్యూనికేషన్..
కేవలం ఫెరోమోన్స్ ద్వారానే కాదు. చీమలు మరెన్నో రకాలుగా కమ్యూనికేట్ అవుతాయి. ఈ ప్రాసెస్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బంపింగ్ (Ant Bumping) ఇందులో ఓ పద్ధతి. బంపింగ్ అంటే...ఒకదానితో ఒకటి కావాలనే ఢీ కొట్టడం. చీమలు ఎప్పుడైనా తమకు కావాల్సిన ఆహారం దొరికినా, లేదంటే శత్రువు గురించి అప్రమత్తం చేయాలన్నా తమ శరీరంపై ఉన్న యాంటీనాలను పైకెత్తి మరో చీమ యాంటినాలను ఢీ కొడతాయి. ఆ సమయంలో ఓ ప్రత్యేకమైన సెంట్ విడుదల అవుతుంది. ఈ సెంట్‌ని సెన్స్ చేయగానే మిగతా చీమలు అప్రమత్తమవుతాయి.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా..? చీమలు తాము ఏం తిన్నాయో మిగతా చీమలకు చెప్పేందుకు చాలా ఆసక్తి కనబరుస్తాయట. వాటి బాడీ లాంగ్వేజ్‌తో ఈ ఫీలింగ్‌ను ఎక్స్‌ప్రెస్ చేస్తాయట. ఎలాగంటారా..? ఓ చీమ మరో చీమను సున్నితంగా రుద్దుతుంది. ఆ సమయంలో చీమల నోరు నుంచి వచ్చే స్రవాల ఆధారంగా..."ఏం తిన్నాయో" మిగతా చీమలు స్పష్టంగా అర్థం చేసుకుంటాయి. ఎవరైనా నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్తే..."అదేంట్రా చీమలా అలా సైలెంట్‌గా వెళ్తున్నావ్" అని అంటారు. చీమలు అంతా సైలెంట్‌గా ఉంటాయి మరి. కానీ...అవీ శబ్దం చేస్తాయట. మనకు వినిపించవంతే. తమ కాళ్లను శరీరానికి రబ్ చేస్తూ మిగతా చీమలకు సిగ్నల్స్ ఇస్తాయి. ఈ శబ్దం మనం వినలేనంత తక్కువగా ఉంటుంది.
అంత యునిటీగా ఎలా ఉంటాయ్..?
చీమల్లో యునిటీ చాలా ఎక్కువ. ఫుడ్ కోసం ఎంత కష్టమైనా పడతాయవి. పైగా...ఆహారం పొదుపు చేసుకోవటంలో మిగతా కీటకాలకు చీమలే స్ఫూర్తి. తమ శరీర బరువుతో పోల్చితే..దాదాపు 10-50 రెట్లు బరువున్న ఆహారాన్ని కూడా సులువుగా మోయగలవు. అదీ వాటి ఎనర్జీ. ఇక టీమ్ వర్క్, యునిటీ విషయానికి వచ్చినా..చీమల్నే ఉదాహరణగా చెబుతారు. వాటి క్రమశిక్షణకు కారణమున్నట్టే...ఈ ఐకమత్యానికీ రీజన్స్ ఉన్నాయి. సాధారణంగా మిగతా కీటకాలు ఉమ్మడిగా జీవించవు. చీమలు మాత్రం అందుకు భిన్నం. అంతా కలిసి ఒకే దగ్గర నివసిస్తాయి. అవి నివసించే ప్రాంతాల్ని "Colonies" అంటారు. చీమలు కొన్ని జట్లుగా విడిపోతాయి. ఏ జట్టుకి ఆ జట్టు తమకు తామే పనులు కేటాయించుకుంటాయి. వీటినే "Workers" అంటారు.
ఐకమత్యమే బలం..
ఆహారం తీసుకొచ్చే బాధ్యత వీటిదే. వీటిలో Soldiers సైనికులు కూడా ఉంటాయి. తమ ప్రాంతాలను రక్షించుకుంటాయి. Queen చీమలు లోపలే ఉంటాయి. ఇవి చూడటానికి చాలా పెద్దగా ఉంటాయి. కొత్త ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు రెక్కల చీమలు సహకరిస్తాయి. వీటిని Dronesగా పిలుస్తారు. ఇలా జట్టుగా పని చేస్తే కానీ...అవి మనుగడ సాగించలేవు. అందుకే...చీమల్ని "ఐకమత్యానికి" ప్రతీకగా చూస్తారు. సాధారణంగా...జంతువులకైనా, మనుషులకైనా అంటువ్యాధులు వస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు మనం ఎన్నో తంటాలు పడాల్సి వస్తుంది. కానీ...చీమలు మాత్రం చాలా తెలివిగా,వ్యూహ్తాత్మకంగా ఈ వ్యాధుల నుంచి తప్పించుకుంటాయి. ఇన్‌ఫెక్షన్ రాకుండా చాలా జాగ్రత్తపడతాయి. ఏ కాస్త లక్షణాలు కనిపించినా వెంటనే వేరైపోతాయి. మిగతా వాటికి ఆ ఇన్‌ఫెక్షన్ సోకకుండా చూసుకుంటాయి. ఈ విషయంలోనూ యునిటీగా ఉంటాయి. ఆహారం సేకరించే సమయంలోనూ ఇంతే ఐకమత్యంగా ఉంటాయి. సో...ఇదీ "చీమకథ"
Also Read: Dog Attacks: కుక్కలు ఎందుకంత అగ్రెసివ్‌గా మారిపోతాయి? డాగ్ సైకాలజీ ఏం చెబుతోంది?