Weather Latest Update: ఎండలు బాబోయ్ ఎండలు- ఈ జిల్లా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి
Telangana Weather News: తెలంగాణలో మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని తర్వాత చిరుజల్లులు కాస్త ఉపశమనాన్ని ఇస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీలో ఇవాళ100కుపైగా మండలాల్లో వడగాల్పులు వీయొచ్చు.
Weather Latest News: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాత్రి ఉక్కపోత పగలు ఎండ మోత. అసలు ఇంట్లో ఉండాలంటే ఊపిరాడదు. బయటకు వెళ్లాలంటే పగులుతుంది మాడు అన్నట్టు ఉంది పరిస్థితి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎన్నడూ చూడని వేడిని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు.
తెలంగాణలో పరిస్థితి ఏంటంటే...
నాలుగు రోజుల పాటు అక్కడక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. 7,8,9 తేదీ వరకు ఎండ వేడి, ఉక్కపోత తప్పదు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమ్రుంభీమ్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్,మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, సూర్యపేటలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. - హనుమకొండ, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్ జిల్లా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నారాయణపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదగరి భువనగిరి
ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరిక ఉన్న ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎక్కువ సమయం ఎండలొ ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎక్కువ నీళ్లు తాగాలని, గొడుగులు కళ్లద్దాలు వాడాలి చెబుతున్నారు. వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.
ఎల్లో అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసిన ప్రాంతాల్లో చిన్న పిల్లలు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం ఇంటి నుంచికి బయటకు రాకూడదు. మిగతా వారంతా తమ పనులు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఉపరితల గాలులు దక్షిణ దిశ నుంచి విస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఇవాళ పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలాగే 130 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
వడగాల్పులు వీచే మండలాలు(130) :-
శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురంమన్యం 12, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, తూర్పుగోదావరి 3, కృష్ణా1, ఎన్టీఆర్ 14, గుంటూరు 5, పల్నాడు6, నంద్యాల 19, అనంతపురం 1, వైఎస్సార్ 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
బుధవారం వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో43, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. కడపజిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు, 59 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.