Weather Update: ఎండల నుంచి తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం, మరో రెండురోజులు చిరుజల్లులు పడే అవకాశం
Weather News: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మార్పుచెందింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండురాష్ట్రాల్లోనూ చిరుజల్లులు కురుస్తున్నాయి. నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది
Weather Latest News: మండుతున్న ఎండలకు జనం అల్లాడుతున్న తరుణంలో చల్లగాలులు, చిరుజల్లులు తెలుగు రాష్ట్రాల ప్రజలను పలకరించాయి. ఒక్కసారిగా వాతావరణం(Weather) లో వచ్చిన మార్పులకు ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు. మూడురోజులుగా వాతావరణం మొత్తం చల్లబడగా...మరోరెండురోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణశాఖ(IMD) తెలిపింది.
ఓ మోస్తరు వర్షాలు
జార్ఖండ్ నుంచి కోస్తా ఒడిస్సా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు అల్లూరి జిల్లా(Alluri Dirstric), పార్వతీపురం(Parvathipuram) మన్యం, విజయనగరం(Vizayanagaram) జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు సైతం కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని..ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని..సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి బలహీన పడింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తుంటే...రాయలసీమ(Rayalasema)లో మాత్రం ఎండ దంచికొడుతోంది. మరో రెండురోజులపాటు వేడి, ఉక్కపోత ఎక్కువ అవుతుందని వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో చిరుజల్లులు
హైదరాబాద్(Hyderabad) నగరంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. మియాపూర్(Miyapur), చందానగర్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మార్చికి మందే ఎండలు ఠారెత్తించగా... ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో నగరవాసులు ఉపశమనం పొందారు. రాగల మూడురోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి(Rangareddy), మేడ్చల్(Medchel) మల్కాజ్‌గిరి(Malkagigiri) జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.