Fact Check: సమోసాలు, జిలేబీలపై తప్పుడు ప్రచారం - అసలు కేంద్రం చెప్పిందేమిటో తెలుసా ?
Samosa: సమోసా, జిలేబీ, లడ్డూ వంటి ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుల్స్ జారీ చేయమని ఆదేశించిందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. అసలు నిజాన్ని తెలిపింది.

Warning Labels on food products: సమోసా, జిలేబీ, లడ్డూ లేదా ఇతర భారతీయ స్నాక్స్‌పై హెచ్చరిక లేబుల్స్ ఉంచమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. మీడియా, సోషల్ మీడియాల్లో జరుగుతున్న ప్రచారం తప్పుదారి పట్టించేవి, ఆధారం లేనివని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (NP-NCD) కార్యక్రమంలో భాగంగా పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించడానికి కొన్ని మార్గదర్శకాలు ప్రకటించారు. వివిధ ఆహార పదార్థాలలో దాగి ఉన్న కొవ్వులు మరియు అధిక చక్కెర వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం.
పని ప్రదేశాల్లో లాబీలు, క్యాంటీన్‌లు, కేఫెటీరియాలు, మీటింగ్ రూమ్‌లలో ఆయిల్ అండ్ సుగర్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఈ బోర్డులు సాధారణంగా వినియోగించే ఆహారాలలో దాగి ఉన్న కొవ్వులు, చక్కెరలు, ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి వివరిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహార ఎంచుకునేలా ప్రోత్సహిస్తాయి. ఇది నిషేధించడం లేదా నియంత్రించడం కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
భారతదేశంలో ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు, ఇతర నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (NCDs) ప్రభావాన్ని తగ్గించడానికి ఈ అడ్వయిజరీని జారీ చేసింది. ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2050 నాటికి భారతదేశంలో సుమారు 44.9 కోట్ల మంది ఊబకాయం లేదా అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అమెరికా తర్వాత భారతే ఉంటుంది. అధిక నూనె , చక్కెర వినియోగం ఈ ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమని అందరికీ తెలిసిన విషయమే.
ఆఫీసుల్లో పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఆహారాల వంటి ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించడం, అలాగే చక్కెర డ్రింకులు, అధిక కొవ్వు స్నాక్స్‌ను పరిమితం చేయడాన్ని ఈ అడ్వైజరీ ప్రోత్సహిస్తుంది. శారీరక శ్రమను పెంచడానికి, మెట్ల వాడకాన్ని ప్రోత్సహించడం, చిన్న వ్యాయామ విరామాలను నిర్వహించడం, నడక మార్గాలను సులభతరం చేయడం వంటి చర్యలను కూడా అడ్వయిజరీ సిఫారసు చేసిది.
There have been some media reports claiming that the Union Health Ministry has directed to issue Warning Labels on food products such as samosa, jalebi and laddoo. These media reports are misleading, incorrect, and baseless. The Union Health Ministry had separately issued an… pic.twitter.com/SG4TLjayn1
— ANI (@ANI) July 15, 2025
ఈ అడ్వైజరీ సమోసా, లడ్డూ , జిలేబి వంటి వాటిని లక్ష్యంగా చేసుకోలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది పిజ్జా, బర్గర్, చాక్లెట్ పేస్ట్రీల వంటి అన్ని అధిక చక్కెర , కొవ్వు ఆహారాలకు వర్తిస్తుందని తెలిపింది.





















