Bihar Voter List Politics: ఎన్నికలకు ముందు బీహార్‌లో ఓటర్ లిస్ట్ గోల్ మాల్ వివాదం - ఏపీలో జరిగినట్లే అక్కడా జరిగిందా ?
Bihar Politics: బీహార్‌లో ఓటర్ లిస్ట్ రాజకీయం ఊపందుకుంటోంది. గోల్ మాల్ చేస్తున్నారని విపక్షాలు రోడ్డెక్కాయి.

Voter list politics in Bihar: బీహార్‌లో రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఓటర్ లిస్ట్ వివాదంపైనే మాట్లాడుతున్నాయి. స్వయంగా రాహుల్ గాంధీ కూడా నిరసనల్లో పాల్గొన్నారు. దీనికి కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
బీహార్‌లో ఓటర్ల జాబితాను పూర్తిగా కొత్తగా తయారు చేయడానికి ECI జూన్ 25, 2025 నుంచి ఐదు దశల సవరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) ఇంటింటికీ వెళ్లి గణన ఫారమ్‌లను పంపిణీ చేసి, ఓటర్ల నుంచి డాక్యుమెంట్‌లను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆగస్టు 1, 2025న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణతో ముగుస్తుంది.
2003 ఓటర్ల జాబితాలో పేరు లేని వారు తమ పౌరసత్వాన్ని నిరూపించడానికి జనన ధృవీకరణ పత్రం, పాఠశాల సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, శాశ్వత నివాస ధృవీకరణ, లేదా ఇతర ప్రభుత్వ జారీ చేసిన డాక్యుమెంట్‌లను సమర్పించాలి. 1987 జూలై 1 తర్వాత పుట్టిన వారు తమ తల్లిదండ్రుల జనన సమాచారాన్ని కూడా సమర్పించాలి. ఆధార్, రేషన్ కార్డ్, MGNREGA కార్డ్ వంటివి ఈ ప్రక్రియలో చెల్లవని ప్రకటించారు. ఈ నిబంధనలపై
రాష్ట్రీయ జనతా దళ్ (RJD), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (TMC), AIMIM, ఇతర ఎనిమిది విపక్ష రాజకీయ పార్టీలు “పౌరసత్వ పరీక్ష”గా చెబుతున్నాయి. ఇది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)ను పరోక్షంగా తీసుకొచ్చే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి.
కొత్త ఓటర్ల సవరణ ద్వారా దళితులు, మహాదళితులు, ముస్లింలు, వలస కార్మికులు, పేదల ఓటు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీహార్ జనాభాలో 65 శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని, ఇలాంటి డాక్యుమెంట్‌లు చాలా మందికి అందుబాటులో లేవని వారంటున్నారు. డాక్యుమెంట్‌లు సమర్పించే గడువు చాలా తక్కువని, ఇది ఓటర్లను అనవసర ఒత్తిడికి గురిచేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సారి ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఈ ప్రక్రియ చేపట్టడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఈ సవరణ ప్రక్రియ బీజేపీకి అనుకూలమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచే కుట్రగా ఉందని రాహుల్ గాంధీ సహా ఇతర పార్టీల నేతలు ఆరోపించారు. వలసదారులు, పేదలు, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే వర్గాల ఓట్లను తొలగించే ప్రయత్నమని వారంటున్నారు. అయితే ఇందులో కుట్ర ఏమీ లేదని అర్హత గల ఓటర్లను జాబితాలో చేర్చే లక్ష్యంతో జరుగుతోందని ఎన్నికల సంఘం చెబుతోంది. సీమాంచల్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో అ బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వచ్చిన వాళ్లు ఓటర్ల జాబితాలో చేరే అవకాశం ఉందని ECI ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే పరిశీలన చేస్తున్నామని తెలిపింది. ఆగస్టు 1న ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత, ఓటర్లు తమ డాక్యుమెంట్‌లను సమర్పించడానికి మరో అవకాశం ఉంటుందని ECI స్పష్టం చేసింది.
బీహార్‌లో 13 కోట్ల జనాభాలో 8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కానీ 2003 జాబితాలో కేవలం 3 కోట్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. దీని వల్ల 5 కోట్ల మంది ఓటర్లు కొత్తగా డాక్యుమెంట్‌లు సమర్పించాల్సి ఉంటుంది. ఎనిమిది విపక్ష పార్టీలు మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఈ సవరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశాయి. ఈ కేసు జూలై 10, 2025న విచారణకు రానుంది





















