Vizag News: త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి సుబ్బారెడ్డి
రాష్ట్రంలో కడప, విజయవాడల్లో మాత్రమే ప్రభుత్వ డెంటల్ కాలేజీలు ఉన్నాయని, విశాఖలోనూ డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్ళి నిర్ణయం తీసుకుంటామన్నారు వైవీ సుబ్బారెడ్డి.
- త్వరలోనే విశాఖలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు: వై.వి.సుబ్బారెడ్డి
- టిటిడి చైర్మన్, వైఎస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి
విశాఖపట్నం: కాబోయే పరిపాలన రాజధాని విశాఖపట్నంలో ప్రభుత్వ డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని టిటిడి చైర్మన్, వైఎస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి. సుబ్బారెడ్డి చెప్పారు. ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో శనివారం జరిగిన 41వ రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్ లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కడప, విజయవాడల్లో మాత్రమే ప్రభుత్వ డెంటల్ కాలేజీలు ఉన్నాయని, విశాఖలోనూ డెంటల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కోరగా, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళి తగిన నిర్ణయం తీసుకుంటామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.
మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయి డెంటల్ డిపార్ట్మెంట్
కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయి డెంటల్ డిపార్ట్మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. డెంటల్ హెల్త్ పై ప్రజల్లో అవగాహన పెరగడంతో సిటీలోతో పాటు గ్రామీణంలో కూడా డెంటల్ ఆస్పత్రులు ఏర్పాటుతున్నాయని తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు చేస్తున్న కృషిని ప్రశంసించారు. వైద్య రంగానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విశేష ప్రాధాన్యమిస్తూ రూ. 7880 కోట్లతో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారని, ఇందులో 5 కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారని వివరించారు.
ఆరోగ్యశ్రీలో కొత్తగా 3 వేలకు పైగా రోగాలు..
పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం కొత్తగా 3 వేలకు పైగా రుగ్మతలను ఆరోగ్యశ్రీలో చేర్చిందని చెప్పారు. 41వ రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్ విజయవంతం కావాలని, డెంటల్ డాక్టర్లందరికి కాన్ఫరెన్స్ ఒక దిక్సూచిలా ఉపయోగపడాలని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పంపిన సందేశంలో ఆకాక్షించారు. అంతకుముందు డెంటల్ కాన్ఫరెన్స్ ను సుబ్బారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాన్ఫరెన్స్ సావనీర్ ను, పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుబ్బారెడ్డిని ఘనంగా సన్మానించారు. 42వ డెంటల్ కాన్ఫరెన్స్ విజయవాడలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్, డాక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ బిత్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారత దేశం విరాజిల్లడానికి దూర దృష్టితో తయారు చేసిన రాజ్యాంగమే కారణమని టీటీడీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాతల గొప్పతనాన్ని ఆయన కొనియాడారు. శనివారం ఉదయం విశాఖపట్నం జిల్లా ఇసుకతోటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాలకు సమాన ఫలాలు అందేలా మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగ ఆమోద దినోత్సవం దేశ ప్రజలందరికీ పండుగ రోజుగా అభివర్ణించారు. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ తలెత్తుకుని బతికేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ కు దేశమంతా రుణపడి ఉంటుందన్నారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.