(Source: ECI/ABP News/ABP Majha)
Vizag Capital City: విశాఖ రాజధాని కోసం అన్ని వర్గాల ప్రజలు గొంతెత్తాలి: తమ్మినేని సీతారాం
Vizag Capital City: అన్ని వర్గాల ప్రజలు సంఘటితంగా ఉద్యమించి విశాఖ రాజధాని కోసం పోరాటం చేయాలని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
Vizag Capital City: అన్ని వర్గాల ప్రజానీకం సంఘటితంగా ఉద్యమించి.. ఉత్తరాంధ్ర ఆక్రందనలను గుర్తించేలా గళం విప్పాలని శాసన సభాపతి తమ్మినేని సీతారం అన్నారు. రాజధాని వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో వికేంద్రీకరణ ద్వారా ప్రాంతాలన్నీ సమానంగా అభివృద్ధి చెందాయన్నారు. భవిష్యత్తు తరానికి ఉజ్వల భరోసా కల్పించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. వేర్పాటువాద ఉద్యమాలు మరోమారు తలెత్తకుండా ఉండాలనేది సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. వివేకవంతమైన ప్రజలు విజ్ఞతతో కార్యనిర్వహక రాజధాని విషయమై ఆలోచన చేయాలన్నారు. సంపద, అభివృద్ధి, సేవలు ఒకేచోట కేంద్రీకృతం అవ్వడం శ్రేయస్కరం కాదని సూచించారు. బుధవారం నరసన్నపేటలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అనాథగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం సమగ్రాభివృద్ధి సాధించాలంటే వికేంద్రీకరణ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. భవిష్యత్తు ప్రజానీకానికి భరోసా ఇవ్వాలంటే వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధిని ఆకాంక్షించాలని అన్నారు. అభివృద్ధిని రాజకీయ కోణంలో చూడడం తగదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముందు చూపుతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప పరిపాలన దక్షకుడిగా స్పీకర్ కొనియాడారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పడటం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి పుంతలు తొక్కే వీలుంటుందన్నారు. రాజధానికి అనువైన, పూర్తి అనుకూలత విశాఖపట్నానికి ఉందన్నారు. లక్షల కోట్లు ఒకే చోట గుమ్మరించి అభివృద్ధి పరిచే అమరావతి కంటే, 15000 కోట్లు పెట్టుబడి ద్వారా విశాఖపట్నాన్ని అగ్రగామి రాజధానిగా అభివృద్ధి చేయవచ్చని అన్నారు.
భారతదేశంలో ప్రముఖ మెట్రోపాలిటన్ నగరాలకు దీటైన నగరంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తే, బ్రహ్మాండమైన ఆర్థిక వనరులను సృష్టించవచ్చని స్పీకర్ తమ్మినేని సీతారం వివరించారు. సంపద సృష్టించాలంటే.. అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ వంటి చర్యల ద్వారా పలు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రగతి పథంలో పయనిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో వికేంద్రీకరణ వలన అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో రాజధానులు, హైకోర్టులు, ఒకే చోట లేవనే విషయాన్ని విపక్షాలు తెలుసుకోవాలని కోరారు. కేంద్రీకృత అభివృధ్ధి ద్వారా వేర్పాటువాద ఉద్యమాలు పుట్టుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో మద్రాస్, హైదరాబాద్ వంటి నగరాల అభివృద్ధి వలన రాష్ట్రాల విభజన తలెత్తిన పరిణామాలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తెరగాలని సూచించారు.
మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో జరిగిన శ్రీ బాగ్ ఒప్పందంలో వికేంద్రీకరణ భావనను ప్రతిపాదన చేసినట్లు శాసన సభాపతి తెలిపారు. ఇందులో భాగంగానే కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయని గుర్తు చేశారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ కూడా భవిష్యత్తులో వేర్పాటువాదం తలెత్తకుండా ఉండేందుకు అనేక ప్రతిపాదనలు చేసిందన్నారు. ముఖ్యంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెండటం లక్ష్యంగా రాజధాని ఏర్పాటు చేయాలని సూచించిందని తెలిపారు. పెద్ద ఎత్తున ధన వ్యయం ద్వారా రాజధాని నిర్మాణం చేపట్టకూడదని స్పష్టం చేసిందన్నారు. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధాని గా కొనసాగించాలని చెప్పినప్పటికీ, అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో ఆంతర్యం ప్రతి ఒక్కరు గుర్తెరగాలన్నారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం గురించి పలు వేదికలపై ఉపన్యసించే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వాస్తవాలకు దగ్గరగా ఉండే విధంగా వ్యవహరించాలని స్పీకర్ తమ్మినేని సీతారం కోరారు. ఒకే చోట సంపద, శ్రమ, మేధస్సు, విజ్ఞానం వంటివి వికేంద్రీకృతమై అభివృద్ధి చెందితే... వేర్పాటువాద శక్తులు విజృంభించక తప్పదని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ మహానగరాన్ని కొన్ని దశాబ్దాలపాటుగా తెలుగు ప్రజానీకం అభివృద్ధి పరచడంలో కీలకంగా నిలిచారన్నారు. హైదరాబాద్ మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందన్నారు. ఇదే సమస్యను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ అంశాన్ని తెర పైకి తీసుకువచ్చారన్నారు. దీనివలన అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడటం విపక్షాలకు తగదన్నారు.