US On India-China Clash: 'భారత్‌కే మా సపోర్ట్'- సరిహద్దు ఘర్షణపై అమెరికా రియాక్షన్
US On India-China Clash: భారత్- చైనా మధ్య నెలకొన్న తాజా సరిహద్దు ఘర్షణపై అమెరికా స్పందించింది.
US On India-China Clash: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ సమీపంలో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన తాజా ఘర్షణపై అగ్రరాజ్యం స్పందించింది. ఘర్షణ తర్వాత పరిస్థితిని నియంత్రించడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రక్షణ శాఖ పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పాట్ రైడర్ పేర్కొన్నారు.
United States| We will continue to remain steadfast in our commitment to ensure the security of our partners. We fully support India's efforts to control the situation: Pentagon press secretary Pat Ryder pic.twitter.com/4nzTlxOkdZ
— ANI (@ANI) December 14, 2022
ఇదీ జరిగింది
డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి.
ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.
భద్రంగా
"డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడి.. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. అయితే మన సైనికులు ఎవరూ చనిపోలేదు. అలానే తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల చైనా సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంత స్థానిక కమాండర్.. చైనా స్థానిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఈ సంఘటన గురించి చర్చించారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది. "