Ghulam Nabi Azad: నేను రాహుల్‌లా కాదు, అవన్నీ అర్థం పర్థం లేని వాదనలు - కాంగ్రెస్‌పై ఆజాద్ మరోసారి ఫైర్
Ghulam Nabi Azad: కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు.
Ghulam Nabi Azad:
వ్యక్తిగత విమర్శలు చేయను: ఆజాద్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు...సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. రాహుల్ కారణంగానే..పార్టీకి ఆ దుస్థితి పట్టిందని ఇప్పటికే చాలా సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మరోసారి ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాహుల్ గాంధీలాగా తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయనని వ్యాఖ్యానించారు. తన ఏడేళ్ల ఎంపీ పదవి కాలంలో ప్రధాని మోదీ విధానాలను మాత్రమే వ్యతిరేకించానని గుర్తు చేశారు. ఓ కశ్మీర్ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు ఆజాద్.
అయితే...ఈ వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. "Climate change" అంటూ సెటైర్ వేశారు. "ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడీయన భాజపాకు నమ్మిన బంటుగా మారాడు" అని పోస్ట్ చేశారు జైరాం రమేశ్. ఈ వీడియోలో ఆజాద్...రాహుల్ గురించి చాలానే మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అసంతృప్తితో G-23 ఏర్పాటు చేశానని, ఆ తరవాతే రాహుల్ గాంధీ...తనపై విమర్శలు చేయటం మొదలు పెట్టారని ఆజాద్ అన్నారు. భాజపాతో కలిసిపోయారన్న ఆరోపణలు చేశారని చెప్పారు.
Climate change ho gaya hai aur ab yeh janab BJP ke wafadaar sipahi ban gaye hain. https://t.co/PiFuOzvVes
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 13, 2022
అప్పటి నుంచే దాడి మొదలు పెట్టారు: ఆజాద్
"పార్టీకి ఓ శాశ్వత అధ్యక్షుడు అవసరం అని లేఖ రాశాం. ఆ తరవాతే మాపై దాడి మొదలైంది. ప్రధాని మోదీకి వకాల్తా పుచ్చుకుని ఈ లేఖ రాశామని ఆరోపణలు చేశారు. మేమూ ఎదురుదాడి చేశాం. కాంగ్రెస్‌ను బలపరచాలని ప్రధాని మోదీ ఎందుకు చూస్తారు...? ఇది అర్థం పర్థం లేని వాదన కాదా.." అని గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. భాజపాతో కలిసిపోయారన్న ఆరోపణలపైనా ఆజాద్ స్పందించారు. "నన్నెవరూ శాసించలేరు. నాపై ఒక్క కేసు కూడా లేదు. నా దగ్గర డబ్బూ లేదు. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి" అని సూటిగా ప్రశ్నించారు. దాదాపు ఏడేళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నానని, ప్రధాని మోదీ పాలసీలపై విమర్శలు చేశానని గుర్తు చేశారు. "భాజపాతో కలిసి పోయానని అంటున్నారు. ఆ పార్టీ నన్ను రాష్ట్రపతిని లేదా ఉప రాష్ట్రపతిని చేస్తుందని ఏవేవో ఊహించుకున్నారు. వీటిలో ఏ ఒక్కటైనా జరిగిందా?" అని అడిగారు ఆజాద్.
త్వరలోనే కొత్త పార్టీ
కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. తన కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని సస్పెన్స్‌కు తెరదించారు. బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో ఈ విషయం స్పష్టం చేశారు.
" కొత్త పార్టీపై పది రోజుల్లో ప్రకటన చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత నాకు మద్దతిచ్చే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. పార్టీలతో సంబంధం లేకుండా నాకు మద్దతు తెలుపుతున్నారు. నేను రాజీనామా చేసి కశ్మీర్‌కు వచ్చిన తర్వాత జమ్మూలో 30-35 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 400 మందిని కలుసుకున్నాను. వారంతా నాకు మద్దతు తెలిపారు. నేను ఏ పార్టీలో ఉన్నా నా వెంట నడుస్తానని చెప్పారు."
-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ మాజీ నేత
Also Read: Twitter Deal | Elon Musk| ఎలన్ మస్క్ ప్రతిపాదనకు ట్విట్టర్ షేర్ హోల్డర్లు అంగీకారం | ABP Desam