వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన నితిన్ గడ్కరీ, ఎన్నికల ప్రచారంలో అస్వస్థత
Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగానే స్పృహ తప్పి పడిపోయారు.
Nitin Gadkari Faints: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ప్రచారంలో పాల్గొన్న సమయంలో వేదికపైనే స్పృహతప్పి పడిపోయారు. ప్రస్తుతానికి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎన్నికల ర్యాలీలో ఆయన స్టేజ్‌పైన ప్రసంగిస్తున్నారు. అప్పటి వరకూ బాగానే మాట్లాడిన గడ్కరీ ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. పక్కనే ఉన్న నేతలు వెంటనే స్పందించి ఆయనను గట్టిగా పట్టుకున్నారు. తరవాత వైద్యులు వచ్చి పరీక్షించి చికిత్స అందించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు గడ్కరీ. మొదటి విడతలోనే ఆ స్థానానికి పోలింగ్ జరిగింది. ప్రస్తుతానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు.
नितिन गड़करी जी भाषण के दौरान बेहोश हुए
— कल्पना श्रीवास्तव 🇮🇳 (@Lawyer_Kalpana) April 24, 2024
महाराष्ट्र में रैली को कर रहे थे संबोधित। प्रभु श्रीराम जी इन्हें जल्द स्वस्थ करें। pic.twitter.com/KIRRglrObi
సరైన సమయానికి చికిత్స అందించడం వల్ల గడ్కరీ వెంటనే కోలుకున్నారు. ఆ తరవాత మళ్లీ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ స్పీచ్ అయిపోయిన వెంటనే ఆయన X వేదికగా పోస్ట్ పెట్టారు. ఉక్కపోతను తట్టుకోలేక స్పృహ కోల్పోయానని, ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
"ర్యాలీ జరుగుతున్న సమయంలో ఎందుకో చాలా నలతగా అనిపించింది. విపరీతమైన వేడి కారణంగా ఒక్కసారిగా స్పృహ తప్పింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. మరో సమావేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు"
- నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
पुसद, महाराष्ट्र में रैली के दौरान गर्मी की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से स्वस्थ हूँ और अगली सभा में सम्मिलित होने के लिए वरूड के लिए निकल रहा हूँ। आपके स्नेह और शुभकामनाओं के लिए धन्यवाद।
— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) April 24, 2024
నిజానికి నాగ్‌పూర్ ఎంపీ అభ్యర్థి పేరుని ప్రకటించడంలో బీజేపీ చాలా ఆలస్యం చేసింది. నితిన్ గడ్కరీ ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాలూ గట్టిగానే వినిపించాయి. వీటన్నింటినీ గడ్కరీ కొట్టి పారేశారు. అలాంటి ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. కాస్త ఆలస్యంగా అయినా హైకమాండ్ మళ్లీ ఆయనకే టికెట్ కేటాయించింది. అంతకు ముందు ఉద్దవ్ థాక్రే గడ్కరీని తమ పార్టీలోకి ఆహ్వానించారు. తమ పార్టీలో చేరితే మంత్రిపదవి ఇస్తానని కూడా ఆఫర్ చేశారు. ఈ వ్యాఖ్యల్ని గడ్కరీ ఖండించారు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దంటూ మందలించారు.