Aadhar Number: ఆధార్ నంబర్ మార్చడం కుదరదు.. ఉడాయ్ కీలక ప్రకటన
ఒక వ్యక్తికి కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చి మరో సంఖ్యను ఇవ్వడం అసాధ్యమని.. ఉడాయ్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
ప్రస్తుతం మన దేశంలో అమలవుతోన్న ప్రతి సంక్షేమ పథాకానికీ ఆధార్ కార్డు తప్పనిసరైన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాలతో పాటు పాన్ కార్డుకు సైతం ఆధార్ నంబరుతో లింక్ ఉంటుంది. ఆధార్ కార్డులో మనం అందించిన వేలి ముద్రల బట్టి మన డేటా అంతా అందుబాటులో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి ఆధార్ కార్డు నంబర్ మార్చడం సాధ్యమేనా? ఆధార్ సంఖ్య మార్పుపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తికి కేటాయించిన ఆధార్ సంఖ్యను మార్చి మరో సంఖ్యను ఇవ్వడం అసాధ్యమని.. ఉడాయ్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇలాంటివి అనుమతిస్తే.. వెహికిల్స్ రిజిస్ట్రేషన్ నంబర్ల మాదిరిగా తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ల కోసం అభ్యర్థనలు వెల్లువెత్తే అవకాశం ఉందని పేర్కొంది.
పిటిషన్ ఏంటంటే..
తనకు కేటాయించిన ఆధార్ సంఖ్య వల్ల.. పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఓ వ్యాపారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. తన ఆధార్ నంబర్ గుర్తు తెలియని విదేశీ సంస్థలకు అనుసంధానమై ఇబ్బందులు కలుగుతున్నాయని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు జస్టిస్ రేకపల్లి విచారణ చేపట్టారు. ఉడాయ్ తరఫు న్యాయవాది జోహబ్ హుస్సేన్ హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. ఆధార్ కార్డు నమోదులో భాగంగా సంబంధిత కార్డు దారులు వ్యక్తులు అందించిన వివరాలకు పూర్తి భద్రత ఉంటుందని తెలిపారు. పిటిషనర్ తన ప్రస్తుత ఆధార్ నంబర్ మరింత భద్రంగా ఉండేందుకు.. నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. దీని కోసం పిటిషనర్ తన మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ వివరాలను అప్‌డేట్ చేయాలని సూచించారు.
ఇప్పుడు ఆధార్ కార్డు నంబర్ మారిస్తే.. అనేక చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని కోర్టుకు నివేదించారు. ఒకరి నంబర్ మారిస్తే.. ఇతరులు కూడా ఇలాంటివే అడిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఫలితంగా భవిష్యత్తులో కార్ల రిజిస్ట్రేషన్ నంబర్ల లాగా తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్లు ఇవ్వాలనే అభ్యర్థనలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయలేదా?
పాన్ కార్డు, ఆధార్ నంబర్ లింక్ (PAN Aadhaar Linking) చేసే గడువు ఈ నెల 30లోగా ముగియనుంది. ఈ గడువు దాటితే పాన్ కార్డ్ ఇనాక్టీవ్ అవుతుంది. అంటే ఆధార్ లింక్ చేయని పాన్ కార్డు భవిష్యత్తులో చెల్లదని అర్థం. దీనిని ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. ఒక వేళ ఉపయోగిస్తే.. ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి 30వ తేదీలోగా పాన్ కార్డును ఆధార్ నంబరుతో లింక్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ను సంప్రదించండి.