Twitter Moves Court : ప్రభుత్వం చెప్పినట్లు చేయలేం - కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ పిటిషన్ !
ప్రభుత్వం ఆదేశించిన ఖాతాలను బ్లాక్ చేయలేమని ట్విట్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.
Twitter Moves Court : కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలపై మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారం రోజుల కిందటే ట్విట్టర్‌కు కేంద్రం తుది నోటీసులు జారీ చేసింది. గతంలో ఐటీ శాఖ జారీ చేసిన అన్ని నిబంధనలను అమలు చేసేందుకు ట్విట్టర్‌కు జులై 4 వరకు గడువు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ గతంలో జారీచేసిన నిబంధనలు పాటించే విషయంలో ట్విట్టర్‌కు ఇదే చివరి నోటీస్ అని, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఐటీ నిబంధనలు అమలు చేయకుంటే చర్యలు తప్పవని నోటీస్‌లో హెచ్చరించారు. జులై తరువాత ట్విట్టర్‌లో పెట్టే అన్ని పోస్టుకుల ఆ సంస్థదే బాధ్యత అని స్పష్టం చేశారు. జూన్ 27న ప్రభుత్వం ఈ నోటీస్ జారీ చేసింది. ట్విట్టర్‌కు గతంలో ప్రభుత్వం ఇదే విషయంలో నోటీస్ జారీ చేసింది.
తుది నోటీసుగా కేంద్రం చెప్పడంతో ట్విట్టర్ ఉన్నపళంగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. గత ఏడాదిగా కేంద్రం అనేక ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని కోరుతూ వస్తోంది. ప్రత్యేక సిక్ దేశం, రైతుల ఆందోళనలు, కరోనా వైరస్, ఇతర సున్నితమైన అంశాలపై తప్పుడు సమాచారం, మిస్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న ఖాతాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరుతోంది. అయితే ట్విట్టర్ వాటిని బ్లాక్ చేయడం లేదు.ఈ అంశంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. తమ ఆదేశాలను పాటించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
అయితే కేంద్రం జారీ చేస్తున్న ఆదేశాలు ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కిందకు రావడం లేదని ట్విట్టర్ చెబుతోంది. అయితే భారత ఐటీ చట్టాలు మాత్రం భారత అంతర్గత భద్రతకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు సృష్టించే ఖాతాలను బ్లాక్ చేయమని కేంద్రం ఆదేశించివచ్చు. వాటిని తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే చర్యలు తీసుకుంటారు. ఇండియాలో ట్విట్టర్‌కు 24 మిలియన్ల మంది ఖాతాదారులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సోషల్ మీడి్యా సంస్థలన్నీ విధిగా పాటించేలా కొత్త నిబంధనలు తెచ్చింది. వాటిని ఖచ్చితంగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఇతర సోషల్ మీడియా కంపెనీలన్నీ ఈ మేరకు అంగీకారపత్రాలు ఇచ్చినా ట్విట్టర్ మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చింది. ప్రభుత్వం చెప్పిన వారందర్నీ బ్లాక్ చేయడం అంటే ఫ్రీ స్పీచ్‌ను తగ్గించినట్లేనని వాదిస్తోంది. ఈ కారణంగా కేంద్రంతో ట్విట్టర్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.