Twitter Blue Verification Badge: ట్విటర్ యూజర్స్‌కు మరో షాక్, బ్లూ టిక్ కోసం డబ్బులు కట్టాలట?
Twitter Blue Verification Badge: ట్విటర్ బ్లూ వెరిఫికేషన్‌లో మార్పులు రానున్నట్టు సమాచారం.
Twitter Blue Verification Badge:
వెరిఫికేషన్ ప్రాసెస్‌లో మార్పులు..
ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలు, మార్పులు చేస్తూ వస్తున్నారు. భారీగా లేఆఫ్‌లు ఉంటాయన్న ప్రకటనను ఇంకా మరిచిపోక ముందే...ఇప్పుడు మరో ప్రకటన చేశారు. వెరిఫికేషన్ ప్రాసెస్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. "వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భారీ మార్పులు చేయనున్నాను" అని ట్వీట్ చేశారు. ఎలాంటి మార్పులు అన్నది ఆయన స్పష్టత ఇవ్వకపోయినా... కొన్ని వార్తా సంస్థలు మాత్రం ఇందుకు సంబంధించిన వివరాలు చెబుతున్నాయి. ట్విటర్ అకౌంట్ వెరిఫికేషన్ చేసి Blue Tick ఇవ్వడానికి ట్విటర్ ఇక నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం...వెరిఫైడ్ యూజర్స్ నెలకు 4.99 డాలర్లు ట్విటర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.415. వెరిఫైడ్ అకౌంట్‌లలో బ్లూ టిక్‌ను అలాగే మెయింటేన్ చేసేందుకు ఇలా ఛార్జ్ చేయనున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఎలన్ మస్క్ ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు. ట్విటర్ బ్లూ (Twitter Blue)లో భాగంగా
ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అమలు చేస్తారని తెలుస్తోంది. అంతే కాదు. బ్లూటిక్ కోసం చేసుకునే సబ్‌స్క్రిప్షన్ ఛార్జ్‌ను కూడా పెంచుతారని అంటున్నారు. గతేడాది జూన్‌లో ట్విటర్ బ్లూని మొదలు పెట్టారు. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లు అందుబాటులో ఉంటాయి. వీరు ట్వీట్‌లను ఎడిట్ చేసేందుకూ అవకాశముంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్ దీనిపై ఓ సర్వే కూడా చేశారు. ట్విటర్‌లో ఎడిట్ ఆప్షన్ ఉండాలనుకుంటున్నారా అని అడగ్గా దాదాపు 70% మంది అవును అనే సమాధానమిచ్చారు. ఆ తరవాతే ఈ నెల మొదట్లో కొందరు యూజర్‌లకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
లేఆఫ్‌లు..
ట్విటర్‌కు అధికారికంగా "బాస్" అయ్యారు ఎలన్ మస్క్. దాదాపు నాలుగైదు నెలల పాటు ఈ డీల్ ఎన్నో మలుపులు తిరిగి చివరకు మస్క్ హస్తగతమైంది. కంపెనీని సొంతం చేసుకున్న మస్క్...ఇప్పుడు తన స్టైల్‌లో అందులో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ట్విటర్ పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన...ట్విటర్ ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. భారీ ఎత్తున "లే ఆఫ్‌లు"ఉండొచ్చన్న సంకేతాలిస్తున్నారు. డీల్ పూర్తైన వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని మస్క్ ముందుగానే అనుకున్నారట. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. వీలైనంత వరకూ మ్యాన్ పవర్‌ను తగ్గించే పనిలో పడ్డారట. అంతే కాదు. కంపెనీలో ఇంకెన్నో మార్పులు తీసుకురావాలని చూస్తున్నారు మస్క్. విధానాల్లో మార్పులు లేకపోయినా...వాటిలో సంస్కరణలు చేపట్టాలని చూస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న వారిని తొలగించిన తరవాతే ఈ ప్రక్షాళన మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే..కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్‌ను తొలగించారు మస్క్. తరవాత ఆయన "Content Moderation Policy"పై దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ట్విటర్ వేదికగా మస్క్ ఓ విషయం స్పష్టం చేశారు. ప్రత్యేకంగా Content Moderation Councilని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.