Telangana News: ఆర్టీసీ సిబ్బందిపై దాడి - ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరిక
Free Bus Scheme: ఆర్టీసీ సిబ్బందిపై దాడి ఘటనలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. అలాంటి వాటిని అస్సలు సహించబోమని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
RTC MD Sajjanar Responds on Attack on RTC Employees: తెలంగాణలో (Telangana) 'మహాలక్ష్మి' (Mahalaxmi) పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడి చేయడాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఖండించారు. 'మహాలక్ష్మి స్కీమ్ అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదు. సిబ్బంది నిబద్ధతతో రోజూ లక్షలాది మందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. సిబ్బంది కృషి వల్లే సంస్థ మనగలుగుతుంది. సిబ్బందిపై ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి విచారణ చేపట్టారు. చ బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని సజ్జనార్ తెలిపారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
#TSRTC కి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్… pic.twitter.com/4PIOXQmAAX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 28, 2023
ఇదీ జరిగింది
కొత్తగూడెం బస్సు డిపో నుంచి బుధవారం మధ్యాహ్నం ఖమ్మం బయల్దేరిన పల్లె వెలుగు బస్సు పట్టణంలోని పోస్టాఫీస్ కూడలి వద్దకు చేరుకుంది. అయితే, అప్పటివరకూ సర్వీస్ ఆటోల్లో కూర్చున్న ప్రయాణికులంతా బస్సు రావడంతో ఒక్కసారిగా బస్సెక్కారు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్ నాగరాజుపై దాడికి దిగారు. అతనిపై నీళ్లు చల్లుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ హల్ చల్ చేశారు. కండక్టర్, ప్రయాణికులు వారిస్తున్నా వారు ఆగలేదు. దీంతో డ్రైవర్ నాగరాజు, కొత్తగూడెం డిపో మేనేజర్ బాణాల వెంకటేశ్వరరావుతో కలిసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
మహిళా కండక్టర్ ఆవేదన
అటు, ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళా కండక్టర్ పై మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించారు. భద్రాచలం నుంచి కొత్తగూడెం వెళ్లే పల్లె వెలుగు బస్సు సారపాక వచ్చే సరికి పూర్తిగా మహిళలతో నిండిపోయింది. కనీసం నిలబడడానికి కూడా చోటు లేక ఫుట్ బోర్డుపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ ప్రయత్నిస్తూ, కొంచెం సర్దుకోవాలని సూచించారు. దీంతో మహిళా ప్రయాణికులు ఆమెపై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. 'ఈ బస్సు మాది. డ్రైవర్ ఉంటే చాలు. నీతో మాకు అవసరం లేదు.' అంటూ వాదించారు. దీంతో సదరు కండక్టర్ బస్సును నిలిపేసి భోరున విలపించారు. ఆమె బాధను తెలుసుకున్న స్థానికులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ కండక్టర్ పట్ల ప్రయాణికుల తీరును తప్పుబట్టారు. అటు, వేములవాడలో బస్సులో సీటు దొరక్క ఓ ప్రయాణికుడు బస్సుకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. దీంతో గందరగోళం నెలకొంది. అదనపు బస్సులైనా నడపాలని, లేకుంటే బస్సుల్లో పురుషుల కోసం ప్రత్యేక సీట్లైనా కేటాయించాలని పురుష ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.