Bandi Sanjay: దివ్యాంగులంటే కేసీఆర్‌కు ఎందుకంత చులకన? టీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఆగ్రహం
టీఆర్ఎస్ పాలనలో దివ్యాంగులు బతకడమే కష్టమైపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పట్ల కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించడం లేదని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల పట్ల కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దివ్యాంగులంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంత చులకన ఎందుకు? కనీసం కొత్త పెన్షన్‌కు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి దివ్యాంగుల పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. టీఆర్ఎస్ పాలనలో దివ్యాంగులు బతకడమే కష్టమైపోయింది’’ అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బద్దెనపల్లి, రామన్నపల్లెలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా బండి సంజయ్‌ను పలువురు దివ్యాంగులు కలిసి తమ సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఆగస్టు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామన్నారని.. ఇంతవరకు అతీగతీ లేదని వాపోయారు. కనీసం తమ దరఖాస్తులను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి దివ్యాంగుల కేటగిరీ పోస్టుల భర్తీ చేయలేదని తెలిపారు.
15 లక్షల మంది..
'ఆగస్టు నుంచే ఆసరా కొత్త పెన్షన్లు ఇస్తామని జూలైలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తంగా 15 లక్షల మంది దాకా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జాబితాలో వితంతువులు, దివ్యాంగులు, బోధకాల బాధితులు, 50 ఏళ్లు నిండిన గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు ఉన్నారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం ఇంకా పరిశీలనే చేయలేదు. కనీసం ఏ శాఖ అధికారులు, సిబ్బంది వెరిఫికేషన్ చేయాలో కూడా ఆదేశాలివ్వలేదు. లబ్ధిదారుల గుర్తింపు సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం ప్రకటించలేదు. సర్కార్ జాప్యం వల్ల కొత్త పెన్షన్ మంజూరు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
‘‘దివ్యాంగుల కేటగిరిలోని టీచర్ పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేయలేదు. 2017లో 532 బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంలోనూ తీవ్ర జాప్యం చేస్తోంది. అసలు ఇప్పటిదాకా నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దివ్యాంగులంటే అంత చులకన ఎందుకు?’’అని బండి సంజయ్ నిలదీశారు.
బీజేపీ అండగా ఉంటుందని భరోసా..
దివ్యాంగులెవరూ బాధపడవద్దని, వారికి అండగా బీజేపీ ఉందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. దివ్యాంగుల సంక్షేమం, హక్కుల విషయంలో బీజేపీ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారి తరఫున పోరాడతామని.. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కృషి భేష్..
దివ్యాంగుల పట్ల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని బండి సంజయ్ ఈ సందర్భంగా వివరించారు. వికలాంగులు అనే పదం బదులు దివ్యాంగులు అనాలని మోదీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా దివ్యాంగులకు అవసరమైన మోటార్ ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక భవనాలను నిర్మిస్తున్నారని.. ప్రతి రాష్ట్రంలో 50 నుండి 100 భవనాలను దివ్యాంగులకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారని వివరించారు.
Also Read: Cyclone Gulab Live Updates: ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న గులాబ్ తుపాను.. సముద్రంలో అలజడి