Viral News: భార్యను చంపాడని జైలుకు పంపారు - మూడేళ్ల తర్వాత ఆ భార్య బతికే ఉందని తేలింది - పాపం ఆ భర్త ..
Karnataka: కర్ణాటకలో ఓ వ్యక్తిని అత్యవసరంగా జైలు నుంచి రిలీజ్ చేశారు. ఎందుకంటే అతను చంపాడని జైలుకు పంపిన మహిళ బతికే ఉన్నట్లు తేలింది మరి.

Karnataka Tribal man: కర్ణాటకలోని మడికెరిలో తన భార్యను "హత్య" చేసినందుకు మూడు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఒక గిరిజన వ్యక్తి ఇటీవల విడుదలయ్యాడు. అతని శిక్ష పూర్తి అయి విడుదల కాలేదు. అతను ఎవరినైతే చంపాడని జైలుకు పంపారో ఆ మహిళ బతికే ఉంది. ఆ విషయం తెలియడంతో విడుదల చేశారు.
కొడగులోని కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లి గిరిజన క్యాంప్‌లో కురుబర సురేష్ (35) అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇరవై కిందట మల్లికా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కూడా టీనేజ్‌కు వచ్చారు. 2020లో, అకస్మాత్తుగా మల్లికా అదృశ్యమైంది. సురేష్ కుశాల్ నగర్ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో మైసూరు జిల్లాలోని బెట్టడపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరి నది ఒడ్డున ఒక మహిళ అస్థిపంజర అవశేషాలను పోలీసులు కనుగొన్నారు.
ఇది మల్లికా మృతదేహమేనని అనుమానించిన కుశాల్ నగర్ గ్రామీణ పోలీసులు సురేష్ ను పంచనామా కోసం సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. కేసు క్లోజ్ చేయడానికి అవి తన భార్యవేనని గుర్తించినట్లుగా పోలీసులు రాసుకుని సంతకం తీసుకున్నారు. సురేష్ తన భార్యను హత్య చేశాడని కేసు పెట్టి 2021 జూన్‌లో సురేశ్‌పై చార్జిషీట్ దాఖలు చేశారు. జూన్ 2021లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే తన భార్య చనిపోలేదని సురేష్ కు గట్టి నమ్మకం. అందుకే ఓ సారి బెయిల్ తెచ్చుకుని ఈ ఏడాది ఏప్రిల్ 1న తన స్నేహితుల సహాయంతో తన భార్యను గుర్తించగలిగాడు. దక్షిణ కొడగులోని బి శెట్టిగేరి సమీపంలో గణేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లుగా సురేష్ , అతని స్నేహితులు గుర్తించారు. దీని తర్వాత సురేష్ పోలీసులకు సమాచారం ఇచ్చి, తన కేసును తిరిగి ప్రారంభించాలని కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
కోర్టు ఆధారాలు కోరినప్పుడు, సురేష్ మడికేరిలోని ఒక రెస్టారెంట్‌లో గణేష్‌తో కలిసి మల్లికా భోజనం చేస్తున్నట్లు వీడియోను చూపించాడు. కోర్టు దానిని పరిగణనలోకి తీసుకుని సురేష్‌ను జైలు నుండి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు మల్లికాను తీసుకొచ్చి కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. తన భర్త కంటే తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని మల్లికా చెప్పింది. సురేష్‌కు సెప్టెంబర్ 2023లో బెయిల్ లభించింది, కానీ రూ. లక్ష భద్రతా బాండ్‌ను సమర్పించే స్తోమత లేకపోవడంతో అతను మరో సంవత్సరం పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. సెప్టెంబర్ 2024లో, సురేష్ చివరకు బెయిల్‌పై విడుదలయ్యాడు.
మూడేళ్ల పాటు అతని జీవితం జైలు పాలయింది. ఆ సమయంలో అతని ఇద్దరు పిల్లలు అనేక కష్టాలు పడ్డారు. పోలీసులు కేసును క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో సురేష్ ను ఇరికించారు. ఈ కారణంగా అమాయకుడు జైలు పాలవడమే కాకుండా నిజంగా ఆ మహిళను హత్య చేసిన వ్యక్తి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ మహిళ మృతదేహం ఎవరిదో పోలీసులకు అంతు చిక్కకుండా ఉంది.





















